మంగళగిరిలో లోకేష్‌కు ప్రత్యర్థి ఎవరు? వైసీపీకి అసలు సమస్య అభ్యర్థా.. వ్యూహమా?
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు మంగళగిరి నుంచి వైసీపీ గెలిచిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే టీడీపీ ఇక్కడ గెలిచింది.
By: Tupaki Political Desk | 29 Sept 2026 4:00 PM ISTటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో పట్టు కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన మంత్రి లోకేశ్ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేలా విస్తృతంగా పనిచేస్తుండగా, ఆయనకు సరైన ప్రత్యర్థిని రంగంలో దింపేందుకు వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. కూటమిలో కీలక నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు అయిన లోకేశ్ హవాను నిలువరించాలనే ఉద్దేశంతో వైసీపీ తాజాగా నియోజకవర్గం ఇంచార్జిని మార్పు చేసిందని చెబుతున్నారు. దీంతో గత మూడేళ్లలో ఐదోసారి మంగళగిరి వైసీపీ సమన్వయకర్తను మార్చినట్లైందని అంటున్నారు.
రాజధాని అమరావతి పరిధిలో ఉండటంతో మంగళగిరికి ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే సమయంలో రాష్ట్రమంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇదే నియోజకవర్గం పరిధిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం కూడా ఉండటంతో సహజంగా మంగళగిరి రాజకీయాలు రాష్ట్రస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు మంత్రి లోకేశ్ గత ఎన్నికల్లో నిలవడం ఒక ఎత్తు అయితే, ఆ గెలుపును శాశ్వతంగా చేసుకునేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా తమ చేజారిన మంగళగిరిని తిరిగి కైవసం చేసుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో తరచూ ఇన్‌చార్జిలను మార్చుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తగా సోమిరెడ్డికి బాధ్యతలు
మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమిస్తూ అధినేత జగన్మోహనరెడ్డి రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. సుమారు రెండేళ్లుగా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డిని తప్పించి అధినేత జగన్ రెడ్డి అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిజానికి మంగళగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలోనే ఉన్నప్పటికీ అధినేత జగన్ రెడ్డి మాత్రం కొత్తవారిని తెరపైకి తెస్తూ లోకేశ్ కు దీటైన ప్రత్యర్థిని తయారు చేయాలని చూడటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
2024 ఎన్నికల వరకు నియోజకవర్గ వ్యవహారాలను ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే చూసుకునేవారు. ఆయన ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అనూహ్యంగా రాజీనామా చేయడంతో అప్పటివరకు టీడీపీలో ఉన్న గంజి చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల్లో పోటీకి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో వెంటనే రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను పోటీకి పెట్టారు. ఎన్నికల తర్వాత లావణ్య స్థానంలో దొంతిరెడ్డి వేమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయనను తప్పించి వేణుగోపాల సోమిరెడ్డిని నియమించడమే హాట్ టాపిక్ అవుతోంది.
సరైన ప్రత్యమ్నాయం కోసమేనా?
తాజాగా వైసీపీ ఇన్‌చార్జిని మార్చడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నారనే ఆలోచనతోనే కొత్తవారిని తెరపైకి తెచ్చారని అంటున్నారు. రాజకీయాలకు కొత్త అయిన వేణుగోపాలసోమిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎటువంటి విమర్శలకు తావులేకుండా, అందరినీ కలుపుకుని పోయే అవకాశాలు ఉంటాయని పార్టీ అధిష్టానం భావించిందని అంటున్నారు. అయితే తరచూ ఇన్‌చార్జులను మార్చడం వల్ల ప్రయోజనం లేదని, మంత్రి లోకేశ్ వంటి బలమైన ప్రత్యర్థికి దీటుగా పార్టీ కూడా ఇన్‌చార్జులకు సహకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార బలంతోపాటు అంగ బలం, అర్ధబలంతో లోకేశ్ ముందు దీటుగా నిలవాలంటే ఎవరికైనా పార్టీ పూర్తిస్థాయిలో అండదండగా నిలవాల్సివుందని అంటున్నారు. మంగళగిరి విషయంలో పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఇలాంటి సహకారం అందడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.
మంగళగిరిపై వైసీపీ జెండా ఎగరేయొచ్చా?
మంత్రి లోకేశ్ కు చెక్ చెప్పాలంటే వైసీపీ ఇన్‌చార్జి మార్పు ఒక్కటే సరిపోతుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన కూడా మారాల్సివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత మంగళగిరిలో లోకేశ్ పాతుకుపోయేలా పనిచేస్తుండగా, ఆయన కదలికలను గమనిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా వైసీపీ పనిచేయాల్సివుందని అంటున్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రస్తుత ఇన్‌చార్జిని మార్చినట్లు భావిస్తున్నారు. అయితే కొత్త వారిని ముందుకు నడిపేలా పార్టీ అధిష్టానం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను తిరిగి పొందేందుకు పార్టీ అధిష్టానం ఫోకస్ చేయాల్సివుందని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఇన్‌చార్జి ఒక్కరే కాకుండా ఏయే వర్గాల ఓటర్లు దూరమయ్యారు? ఎందుకు దూరమయ్యారు? అన్న కోణంలో ఆలోచించి, అందుకు తగిన వ్యూహాలు సిద్ధం చేయాల్సివుందని అంటున్నారు. పార్టీలో ఈ సన్నద్ధత లేకుండా ఇన్‌చార్జులను మార్చుతూ పోవడం వల్ల ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లోనే పెరిగిన టీడీపీ బలం
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు మంగళగిరి నుంచి వైసీపీ గెలిచిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే టీడీపీ ఇక్కడ గెలిచింది. అయితే 2014, 2019లో వైసీపీ గెలిచిన రెండుసార్లు ఆ పార్టీ స్వల్ప ఓట్లతోనే గట్టెక్కిందని అంటున్నారు. 2014లో కేవలం 12 ఓట్లతో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకోగా, 2019లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హవాలోనూ సుమారు 5 వేల ఓట్లతో గెలిచిందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీపై పైచేయి సాధించాలంటే వైసీపీ వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల ఓటర్లు ఉండగా, గత ఎన్నికల్లో 2.53 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఇందులో వైసీపీకి 76 వేల ఓట్లు పడ్డాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో సుమారు 1.08 లక్షల ఓట్లు సాధించి 5 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. అంతకుముందు ఎన్నికల్లో సుమారుగా 89 వేల ఓట్లు పొందింది. అప్పుడు టీడీపీకి కూడా అంతే సంఖ్యలో ఓట్లు పోలవ్వగా, పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ దాదాపు 1.67 లక్షల ఓట్లకు ఎగబాకిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మంగళగిరిలో టీడీపీని పడగొట్టేందుకు వైసీపీ ఓటుబ్యాంకు రెండింతలు పెరగాల్సివుందని అంటున్నారు. గత ఎన్నికల్లో కూటమి గాలిలోనూ 76 వేల ఓట్లు సాధించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి అదనంగా మరో 76 వేల ఓట్లు పొందేలా వైసీపీ పనిచేయాల్సివుందని అంటున్నారు. అధిష్టానం ఈ దిశగా అడుగులు వేసినప్పుడే ఇన్‌చార్జులు కూడా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని అంటున్నారు.
