సెకండ్ కి జగన్ షేక్ హ్యాండ్
వైసీపీలో చాలా మార్పులు చూడబోతున్నామా అంటే అవును అనే మాట వినిపిస్తోంది. పార్టీలో ఉన్న వారిలో ఎవరేమిటి అన్నది అధినాయకత్వానికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోందా అంటే అది కూడా నిజమే అని అంటున్నారు.
By: Satya P | 6 Oct 2025 2:00 PM ISTవైసీపీలో చాలా మార్పులు చూడబోతున్నామా అంటే అవును అనే మాట వినిపిస్తోంది. పార్టీలో ఉన్న వారిలో ఎవరేమిటి అన్నది అధినాయకత్వానికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోందా అంటే అది కూడా నిజమే అని అంటున్నారు. నిజానికి పార్టీ అధికారంలో ఉంటే చాలా మంది ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు మాదిరిగా అందరూ చేరుతారు. అపుడు ఎవరేమిటి అన్నది తెలియదు కానీ పవర్ పోయాక అసలు కధ బయట పడుతుంది. పార్టీ అంటే ప్రేమ ఎవరికి ఉంది, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఎవరికి ఉంది అన్నది కూడా తెలుస్తుంది. టీడీపీకి 2019 నుంచి 2024 మధ్యలో చాలా విషయాలు అర్ధం అయ్యాయి. ఇపుడు వైసీపీకి అదే విధంగా కళ్ళకు గంతలు వీడి రియల్ ఏమిటో కలర్ ఫుల్ గా అర్ధం అవుతోంది అని అంటున్నారు.
ఎందరు వెళ్ళిపోతున్నా :
నిజానికి వైసీపీది చూస్తే పదిహేనళ్ళ రాజకీయ ప్రస్థానం. ఈ రోజుకు ఒక్కసారి తరచి చూస్తే పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారు ఎంతమంది అన్నది కనుక చూస్తే జవాబు చేదుగానే ఉంటుంది. పునాది నుంచి ఉన్న వారే చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. అనేక మంది నేతలు కొత్తగా వచ్చారు. ఇంకా చెప్పాలీ అంటే 2019 ఎన్నికల ముందు వచ్చిన వారిలో అత్యధికులు ఈ రోజున పార్టీలో లేరు. అంటే అధికారం వస్తుందని ఆశించి వచ్చిన వారే కనిపిస్తారు అన్న మాట. ఈ విషయాల మీద అవగాహన ఉన్న వైసీపీ అధినాయకత్వం ఎవరు వెళ్ళిపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదని అంటారు.
వారు మాత్రం అలాగే :
వైసీపీలో చూస్తే ఎందరు నాయకులు వెళిపోయినా ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం పటిష్టంగా ఉంది. నిజానికి పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు ఏవీ వారికి దక్కలేదు. చాలా మంది నైరాశ్యంలోనే గడిపారు. కానీ పార్టీ ఓడితే కూడా వారే అందులో ఉంటున్నారు. మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలని మనసారా కోరుకుంటున్నారు. పార్టీ యాక్టివిటీస్ కి స్పందిస్తున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం చూపు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఉంది అని అంటున్నారు.
వారికే చాన్స్ అంటూ :
పార్టీలో రానున్న రోజులలో సమూలమైన మార్పులు చేస్తారు అని అంటున్నారు. పార్టీ పదవుల విషయం తీసుకుంటే ఇప్పటికే చాలా మందికి ఇచ్చారు. అందులో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో బాగా రాణించేవారికి తప్పనిసరిగా పార్టీ అధినాయకత్వం అవకాశాలు ఇస్తుందని అంటున్నారు. వారిని ఫోర్ ఫ్రంట్ లో పెడుతుందని అంటున్నారు. ఇక మీదట అగ్ర తాంబూలం కూడా వీరికి దక్కుతుందని అంటున్నారు.
పార్టీలో కీలకం :
ఏ పార్టీకి అయినా నిబద్ధతతో పనిచేసే వారే కీలకం అని అంటున్నారు. పార్టీ అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ ఓటమి పాలు అయ్యాక పార్టీ వదిలేసేవారు అలాగే గెలిచాక తిరిగి వచ్చి చేరే వారు కాకుండా పార్టీని పట్టించుకుని పార్టీ కోసం ఉండే వారికే రానున్న రోజులలో కీలకంగా చేయాలని అలాగే వారికే అన్ని విధాలుగా అవకాశం కల్పించాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది. దాంతో వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులకు మరింతగా మంచి రోజులు రానున్నాయని అంటున్నారు.
