గుడివాడ - గన్నవరం సేమ్ టు సేమ్.. వైసీపీ వాట్ నెక్ట్స్ ..!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు ఏవి? అంటే.. వెంటనే గుర్తుకు వచ్చేది గుడివాడ, గన్నవరం.
By: Madhu Reddy | 1 Jan 2026 8:00 PM ISTఉమ్మడి కృష్ణాజిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు ఏవి? అంటే.. వెంటనే గుర్తుకు వచ్చేది గుడివాడ, గన్నవరం. ఈ రెండు నియోజకవర్గాలు కూడా కమ్మ సామాజిక వర్గానికి పట్టుకొమ్మలు. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారు.. కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం.. గెలిచిన వారు కూడా వారే కావడం గమనార్హం. ఇక, పార్టీల పరంగా చూసుకుంటే.. గన్నవరంలో టీడీపీకి పార్టీ పరంగా బలమైన పునాదులు ఉన్నాయి. ఇక, గుడివాడలో మాత్రం వ్యక్తిపరంగా పునాదులు ఏర్పడ్డాయి.
ఈ రెండు నియోజకవర్గాల్లో.. గుడివాడలో కొడాలి నాని వ్యక్తిగత ఇమేజ్‌తో గత నాలుగు సార్లుగా విజయం దక్కించుకున్నారు. ఇక, గన్నవరంలో మాత్రం అటు టీడీపీ, ఇటు వ్యక్తిగత ఇమేజ్‌ను కలగలిపి.. వల్లభనే ని వంశీ వరుస విజయాలు దక్కించుకున్నారు. కానీ.. వ్యక్తిగత ఇమేజ్‌ను ఇరువురు స్వయంకృతంగా డ్యా మేజీ చేసుకున్న నేపథ్యంలో ఇరువురు కూడా గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక్కడ పార్టీల కంటే కూడా.. వ్యక్తిగత ఇమేజ్‌కు ప్రాధాన్యం ఉంది.
ఇక, ఇప్పుడు మరింతగా ఇరువురి ఇమేజ్ తగ్గిపోయింది. పైగా.. ఎవరూ పార్టీలో వారి తరఫున గళం వినిపిం చేందుకు కూడా రెడీ కాలేక పోతున్నారు. గుడివాడ విషయానికి వస్తే.. కొడాలి నాని గత 18 నెలలుగా ఎవరికీ చేరువ కాలేదు. నియోజకవర్గానికి వచ్చినా.. సొంత పనులకే పరిమితం అవుతున్నారు దీంతో ఆయన కేడర్ కూడా.. కకావికల్ అయిపోయింది. ఉన్న కొద్దిపాటి కేడర్ మాత్రమే ఆయన వెంట ఉంది. అయినా.. పార్టీ కార్యక్రమాలకు వారు దూరంగానే ఉంటున్నారు. దీంతో గుడివాడలో వైసీపీ జోరు.. హోరు ఎక్కడా కనిపించడం లేదు.
ఇక, గన్నవరంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంశీ గ్రాఫ్ పెరగకపోగా.. ఆయన మరిన్ని కేసుల్లో చిక్కుకోవడంతో ఇప్పుడు ఆయనను పలకరించేవారు కూడా కనిపించడం లేదు. మరోవై పు.. వ్యక్తిగత ఇమేజ్ పోయింది.. పార్టీ పరంగా ఆయనకు దన్ను కూడా కనిపించడం లేదు. ఇంకోవైపు గన్న వరం, గుడివాడ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులు.. ప్రజలకు చేరువ అవుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పట్లో వైసీపీ హవా కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
