వైసీపీకి మిగిలింది 55... ఎన్నడూ లేని పరిస్థితుల్లో పార్టీ!
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ద్వారా వైసీపీ దాదాపు లక్షన్నర వరకు పదవులు పొందింది.
By: Tupaki Political Desk | 22 Sept 2026 4:51 PM ISTవిపక్షం వైసీపీలో రాజకీయ నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో గెలిచిన తర్వాత ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఎదురులేని రాజకీయం చేసిన వైసీపీ.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ స్థానిక సంస్థల్లో వైసీపీ నేతల ప్రాతినిధ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై బలంగా పోరాటం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల పదవీకాలం కూడా పూర్తి అవడంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో వైసీపీ నేతలు పదవులు కోల్పోతున్నారు. దీంతో రాష్ట్రంలో వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు మాత్రమే మిగిలారని చెబుతున్నారు.
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ద్వారా వైసీపీ దాదాపు లక్షన్నర వరకు పదవులు పొందింది. 2021లో జరిగిన పంచాయతీ, మండల, జడ్పీ ఎన్నికల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్ పోరులో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అప్పట్లో ఎన్నికలను బహిష్కరించడంతో వైసీపీ ఏకపక్షంగా దాదాపు 99 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలతోపాటు ఆ తర్వాత వివిధ కోటాల్లో ఎమ్మెల్సీలను గెలిపించుకుని రాష్ట్రంలోని రెండు చట్టసభల్లో వైసీపీ ఆధిక్యం సంపాదించింది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో 99 శాతం పదవులతో రాష్ట్రంలో ఎటు చూసినా వైసీపీ నేతలే కనిపించేవారు.
అయితే ఇప్పుడు ఆ ఘనత అంతా చరిత్రలో కలిసిపోయింది. ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీల పాలకవర్గాలకు గడువు తీరిపోవడంతో ఆయా పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు మాజీ అయ్యారు. ఇక ఈ నెల 24తో జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాలకు గడువు తీరనుంది. ఆయా సంస్థలకు ప్రత్యేకాధికారుల పాలన వస్తోంది. దీంతో రాష్ట్రంలో స్థానిక పాలన కూడా వైసీపీ చేతులు మారినట్లుగా విశ్లేషిస్తున్నారు. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నందున అంతవరకు ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఇక ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మళ్లీ ఆ పార్టీకి కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎమ్మెల్సీలతోపాటు నలుగురు లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీకి మిగిలినట్లు చెబుతున్నారు. దీంతో ఒకప్పుడు వేల మంది ప్రజాప్రతినిధులతో కళకళలాడిన పార్టీ వేదికలు బోసిపోనున్నాయని అంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని అంటున్నారు. పార్టీ బలంగా ఉండాలంటే అధికారాలు ఉండే పదవులు కూడా ముఖ్యమన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పూర్వ వైభవం దిశగా పనిచేయాల్సివుంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధిగమించి వైసీపీ ఎలా రాణిస్తుందనేదే చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.
