మండలిలో వైసీపీ : వాకౌట్లేనా...డిబేట్లు చేయరా ?
వైసీపీకి ఇపుడు అతి పెద్ద దిక్కు ఆశాకిరణం శాసన మండలి అని వేరేగా చెప్పాల్సిన పని లేదు.
By: Satya P | 25 Sept 2025 9:11 AM ISTవైసీపీకి ఇపుడు అతి పెద్ద దిక్కు ఆశాకిరణం శాసన మండలి అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అసెంబ్లీని వారే వద్దు అనుకున్నారు. ఇక మండలిలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. పైగా చైర్మన్ కూడా మైక్ ఇస్తారు. దాంతో వైసీపీకి అక్కడ తమ వాదన వినిపించేందుకు చాన్స్ ఉంది. మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత ఢక్కా మెక్కీలు తిన్న బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనను ఎంపిక చేయడం వెనక ముఖ్య ఉద్దేశ్యం కూటమి ప్రభుత్వాన్ని ముప్ప తిప్పలు పెడతారని.
పెద్దరికంతో పెద్దాయన :
బొత్స మండలిలో తన పెద్దరికాన్ని నిరూపించుకుంటున్నారు. అదే సమయంలో ఆయన పెద్ద మనిషిగా వివాదరహితుడిగా ఉండాలని చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అధికారం మీ చేతిలో ఉంది ఏమైనా చేసుకోండి అంటూ సభకు ఒక నమస్కారం పెట్టేస్తూ బొత్స తనదైన శైలిలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయాన్ని పండిస్తున్నారు అని అంటున్నారు. సభలో అనేక కీలక అంశాల మీద చర్చ జరగాలి. ప్రతిపక్షమే దానిని ముందుకు తీసుకుని రావాలి. అంతే కాకుండా ఒక ఇష్యూని లేవనెత్తితే దానికి లాజికల్ ఎండ్ ని కూడా చూడాల్సి ఉంది. కానీ వైసీపీ ఆ విధంగా చేస్తోందా అన్నదే చర్చగా ఉంది.
ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి :
ఇక ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇష్యూ ఉంది. దాని మీద బీఏసీలో పెట్టకుండా సభలో చర్చిద్దామని వైసీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది అని మంత్రి లోకేష్ ఎత్తి చూపారు. బకాయిలు నాలుగు వేల కోట్లు పెట్టి పోయారు అని కూడా నిందించారు. అయితే దానికి వైసీపీ నుంచి పెద్దగా సమాధానం అయితే లేదు. నిజానికి 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 లో అంతకు ముందు టీడీపీ మిగిల్చిన 2400 కోట్ల రూపాయలను తీర్చింది. ఈ విషయాన్ని అదే పార్టీకి చెందిన వెంకటగిరి ఇంచార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. మరి ఈ విషయం మండలిలో వైసీపీ చెప్పి కూటమిని నిలదీయవచ్చు కదా అన్నది అంటున్న మాట.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ విషయం తీసుకుంటే వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ మొత్తం సబ్జెక్ట్ చెప్పి ప్లాంట్ ని కాపాడాలని కోరారు. దానికి లోకేష్ మీ హయాంలో ఏం పీకారు అని ఆవేశంగా ప్రశ్నించడంతో వైసీపీ అసలు విషయం వదిలేసి మహిళలను అలా అంటారా అంటూ ఆ ఇష్యూ మీదనే మాట్లాడడంతో సబ్జెక్ట్ వేరే రూట్ కి వెళ్ళింది అని అంటున్నారు. ఇక వైఎస్సార్ విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినవి ఉన్నాయని వాటిని తొలగించాలని టీడీపీ కడప ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తే అధికారంలో ఉన్నారు అంతా మీ ఇష్టం అని వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఇక మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానం మీద వైసీపీ బయట గట్టిగానే విరుచుకుపడుతోంది. ఆ సబ్జెక్ట్ మీద మంత్రి సత్య కుమార్ యాదవ్ సభలో మాట్లాడుతూంటే తమ వాదనను వైసీపీ గట్టిగా డిఫెండ్ చేసుకోవాల్సి ఉండగా వాకౌట్ చేసింది. దాని మీద సత్య కుమార్ యాదవ్ డిబేట్ లో పాల్గొనకుండా వైసీపీ ఎమ్మెల్సీలు పారిపోతున్నారు అని సెటైర్లు వేశారు. ఇలా ఏ ఇష్యూ మీద అయినా గట్టిగా డిబేట్ పెట్టి అధికార పార్టీని జవాబు చెప్పించేలా ఉండాలి కానీ ఈ వాకౌట్లు ఏంటి సామీ అని అంతా అంటున్నారు.
