Begin typing your search above and press return to search.

వైసీపీకి వరుస షాకులు.. న్యాయ పోరాటాల్లో విఫలమవుతున్నారా? సుప్రీంలో తాజాగా ఎదురుదెబ్బ

న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించడంలో వైసీపీ విఫలమవుతుందా? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Political Desk   |   25 Aug 2026 1:48 PM IST
వైసీపీకి వరుస షాకులు.. న్యాయ పోరాటాల్లో విఫలమవుతున్నారా? సుప్రీంలో తాజాగా ఎదురుదెబ్బ
X

న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించడంలో వైసీపీ విఫలమవుతుందా? అన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఆ పార్టీ చేస్తున్న న్యాయపోరాటాల్లో ఎక్కువగా వ్యతిరేక తీర్పులే వస్తుండటం ఈ చర్చకు ఊతమిస్తోందని అంటున్నారు. వరుసగా కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు తింటున్నా, వైసీపీ అధిష్టానం సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఉటంకిస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేయడంతోపాటు, ఏవైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం స్పష్టం చేసింది.

సోషల్ మీడియా అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సస్పెండ్ చేయించిందనే వైసీపీ వాదనలను వినేందుకు కూడా సుప్రీంకోర్టు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ తొందరపడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా స్థానిక కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు మెట్లెక్కడం వల్లే ఇటువంటి తీర్పు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టులో న్యాయం దక్కనప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే బాగుండేదని, కానీ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ప్రయోజనం దక్కలేదని అంటున్నారు. దీనివల్ల సమయం వృధా అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో వైసీపీ చేస్తున్న న్యాయపోరాటాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఆ పార్టీ లీగల్ టీమ్ మరింత పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి మారినప్పుడు సైతం కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగడం సహజమైపోయిందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసిన కేసు ఒక ఎత్తు అయితే, ఇటీవల వైసీపీ ఉధృతంగా పోరాడిన డీఎస్పీపైనా న్యాయస్థానంలో చతికిలపడిందని గుర్తు చేస్తున్నారు.

గత రెండేళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వైసీపీ వేసిన పలు పిటిషన్లకు వ్యతిరేకంగా తీర్పులు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాల్సివుందని అంటున్నారు. కోర్టుల్లో కేసులు వేసిన సమయంలో పార్టీ లీగల్ టీమ్ ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటే ఇలాంటి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు ఉండవని అంటున్నారు. మరోవైపు తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో వైసీపీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సివుంటుందని అంటున్నారు. ఇందుకు కొంత సమయాభావం అయ్యే పరిస్థితి కనిపిస్తోందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వైసీపీ ఖాతాలు మరికొంతకాలం బ్యాన్ లోనే ఉండనున్నాయని విశ్లేషిస్తున్నారు.