లీగల్ సెల్‌తో వైసీపీకి లాభమెంత ..!
అయితే.. ఇప్పుడు వీరిని రాజకీయంగా వినియోగించుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు.
By: Garuda Media | 6 Aug 2025 9:46 AM ISTఏ పార్టీకైనా కొన్ని వింగ్స్ ఉంటాయి. అలాంటివాటిలో లీగల్ సెల్ ఒకటి. ఇతర పార్టీల మాటేమో.. కానీ, వైసీపీ, టీడీపీలలో లీగల్ సెల్‌కు నిరంతరం పని ఉంటోంది. నాయకులపై కేసులు.. బెయిళ్లు, వాదనలు.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల సాగదీతలు ఇలా.. లీగల్ సెల్ నాయకులకు పని చేతినిండా ఉంటోందన్నది వాస్తవం. అయితే.. ఇప్పుడు వీరిని రాజకీయంగా వినియోగించుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. తన పార్టీ లీగల్ సెల్‌తో ఆయన భేటీ అయి.. దాదాపు ఇదే పనికి పురమాయించారు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. టీడీపీలో ఉన్న లీగల్ సెల్‌తో పోల్చుకుంటే.. వైసీపీలో ఉన్న లీగల్ చాలా వరకు వీక్‌గా ఉందని ఆ పార్టీ నాయకులే చెబుతారు. ఇటీవల నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరిని జైల్లో పెట్టగా ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ ఇప్పించలేక పోయారన్న వాదనవైసీపీ లీగల్ సెల్‌పై ఉంది. అంతేకాదు.. బలమైన వాదనలు కూడా వినిపించలేక పోతున్నారని.. కొన్నాళ్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఓ కీలక న్యాయవాదిని వైసీపీ నాయకులు సంప్రదించారు. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉంది.
మరి ఇంత వీక్‌గా ఉన్న వైసీపీ లీగల్ సెల్ ను ఇప్పుడు పార్టీ పరంగా రాజకీయాలకు వాడుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. వారు ఏమేరకు పనిచేస్తారో చూడాలి. ఇక, జగన్ చెప్పిన ప్రకారం.. లీగల్ సెల్ నాయ కులు.. పార్టీ నేతలను వేధిస్తున్నవారి పేర్లను ఆన్‌లైన్‌లో తమ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే.. బలమైన వాయిస్ వినిపించాలి. పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేలా స్పందించాలి. అలాగే.. లీగల్ సెల్ నాయకులు కట్టు తప్పకుండా పార్టీ కోసం పనిచేయాలి.
ఇవన్నీ.. జగన్ పెట్టిన షరతులు. అయితే.. వీటిలో ఎన్నింటిని వారు పాటిస్తారన్నది చూడాలి. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లీగల్ సెల్ నాయకులకు బయట కూడా పనిలేకుండా పోయిందనే వాదన ఉంది. దీనిని వారు జగన్‌కు కూడా చెప్పారు. వైసీపీ లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులకు కేసులు కూడా తగ్గిపోయాయని వారు స్వయంగా జగన్‌కు వినిపించారు. అయితే.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మేలు చేస్తామని ఆయన హామీ ఇచ్చి ఊరుకున్నారు. అంటే.. ఏ సమస్యలపై పోరాటం చేయాలని జగన్ చెబుతున్నారో.. అలాంటి సమస్యల్లోనే లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు. మరి వీరు ఏమేరకు పార్టీకి మేలు చేస్తారన్నది చూడాలి.
