ఉలుకూ లేదు.. పలుకూ లేదు.. ఉత్తరాంధ్ర వైసీపీ అగచాట్లు.. !
కానీ, దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకత అదే విధంగా వైసిపి హయాంలోనే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అంటివి ఇబ్బందికరంగా మారాయి.
By: Garuda Media | 8 Oct 2025 10:04 AM ISTఉత్తరాంధ్రలోని మూడు కీలక జిల్లాల్లో వైసీపీ ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర పై వైసీపీ నాయకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏ సమస్యను పట్టించుకోకపోవడం.. నాయకులు బయటకు రాకపోవడం.. అంటివి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసిపి ప్రభావాన్ని భారీగా తగ్గించాయి. కొన్నాళ్ల కిందట విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వైసిపి ప్రకటించింది.
కానీ, దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకత అదే విధంగా వైసిపి హయాంలోనే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అంటివి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆ నిర్ణయం నుంచి వైసీపీ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యలపై పెదవి విప్పిన పరిస్థితి లేదు. ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన నాయకులు అందరూ సైలెంట్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే పెద్దగా నాయకుల సందడి లేకుండా పోయిందనే చెప్పాలి.
ఒకప్పుడు బలమైన వాదన వినిపించిన నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే, తమపై కేసులు ఉన్నాయనో.. లేకపోతే తమ వ్యాపారాలు వ్యవహారాలకు ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడతాయనో భావించిన నాయకులు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డిని ఇన్చార్జిగా తప్పించిన తర్వాత కన్నబాబుకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటివరకు ఆయన పెద్దగా ఉత్తరాంధ్ర జిల్లాల జోలికి పోయిన పరిస్థితి లేదు.
ఒకప్పుడు విజయసాయిరెడ్డి బలమైన ముద్ర వేయగా ఆ తర్వాత ఇప్పుడు వరకు ఆ రేంజ్ లో ఉత్తరాంధ్రలో వైసీపీని నడిపించిన నాయకులు లేకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారింది. విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో టిడిపి దూకుడు భారీగా ఉండడం.. విశాఖలో జనసేన, టిడిపి నేతలతో పాటు బిజెపి నేతల దూకుడు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో వైసీపీ నాయకుల దూకుడు గాని వారి మాట కానీ ఎక్కడ వినిపించకపోవడం గమనార్హం. కేవలం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రమే తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. అయినా ఆయన మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం వైసీపీని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
