ఆ నియోజకవర్గాల్లో హాట్ టాపిక్: పోటీకి కూడా రెడీగా లేరు..!
ఇప్పుడు ఇదే పరంపరలో విజయవాడ పార్లమెంటు స్థానం కూడా చేరింది. అలానే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా వైసీపీ కొరుకుడు పడడం లేదు.
By: Garuda Media | 16 Jan 2026 3:00 PM ISTగెలుపా-ఓటమా? అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు మెచ్చితే.. రాజు, లేకపోతే.. సరాజు ( ఉత్తిరాజు ) గా నాయకులు మిగిలిపోతారు. ఏదేమైనా.. ఎన్నికలు అనగానే నాయకులు ముందుకు వస్తారు. పోటీకి సై అంటారు. టికెట్ల కోసం కొట్టేసుకుంటారు. పార్టీపై అలుగుతారు.. అధినేత లపై ఒత్తిళ్లు కూడా తీసుకువస్తారు. ఇది అన్ని పార్టీల్లోనూ తరచుగా కనిపించే దృశ్యం. మరీ ముఖ్యంగా వైసీపీలోనూ ఈ తరహా వాతావరణం కనిపించింది.
అయితే.. వచ్చే 2029 ఎన్నికల నాటికి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు పోటీకి కూడా సిద్ధపడే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంటే.. నాయకులు ఉన్నా.. లేకున్నా.. ఆయా నియోజకవర్గాల్లో ఎవరూ వేలు పెట్టి చెయ్యి కాల్చుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇలా.. మూడు నియోజకవర్గాలు ఇప్పటికే తెరమీదికి వచ్చాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పంలో వైసీపీని గెలిపించే నాయకులు కాదు.. అసలు వైసీపీ తరఫున పోటీ చేసే నాయకులు కూడా కనిపించడం లేదు.
ఇప్పుడు ఇదే పరంపరలో విజయవాడ పార్లమెంటు స్థానం కూడా చేరింది. అలానే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా వైసీపీ కొరుకుడు పడడం లేదు. బలమైన బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఉండ డంతో ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక, గన్నవరంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలు స్తోంది. అయితే.. ఇక్కడ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసినా.. ఆయన గెలుపుపై సందేహాలు ఇప్పటికే ముసురుకున్నాయి. అందుకే నాయకులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
ఇక, గుంటూరు పార్లమెంటు కూడా వైసీపీ వదులుకుందన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి 2019లో విజయం దక్కించుకున్నా.. ఇప్పుడు అక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేకుండా పోయా రు. దీంతో వైసీపీకి చాలా నియోజకవర్గాలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి ఈ అంచనాలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. మూడేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటికి ఏమైనా మార్పులు వస్తే.. అప్పుడు నాయకులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరి ఈ విపత్కర స్థితిని ఎలా అధిగమిస్తారో చూడాలి.
