Begin typing your search above and press return to search.

ఖాళీ అవుతున్న వైసీపీ...అన్నీ తప్పటడుగులే !

అదే వైసీపీలో అయితే ఇంచార్జి పదవులు తరచూ మార్చేస్తూ పార్టీలో వర్గాలను కోరి అధినాయకత్వమే పెంచి పోషిస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి.

By:  Satya P   |   10 Sept 2026 8:30 AM IST
ఖాళీ అవుతున్న  వైసీపీ...అన్నీ తప్పటడుగులే !
X

వైసీపీ అధినాయకత్వం నుంచి కీలక నేతలు అంతా కూడా ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే గెలిచేస్తామని చెబుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ చూసుకునే మాట్లాడుతున్నారా అన్న చర్చ వస్తోంది. సంస్థాగతంగా వైసీపీ చాలా చోట్ల బలహీనంగా ఉంటే గెలుపు ఎలా సాధ్యమని సొంత పార్టీలోనే ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ రాజకీయంగా చేసినన్ని ప్రయోగాలు మరే పార్టీ చేయదనే అంటారు. ప్రతీ నియోజకవర్గంలో ఎందరో నేతలను మార్చిన ఘనత వైసీపీదే. టీడీపీలో దశాబ్దాలుగా ఒకే నేతను కొనసాగిస్తూ ఇపుడు మాత్రం కొత్త వారికి చాన్స్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా స్మూత్ గా సాగిపోతోంది. అదే వైసీపీలో అయితే ఇంచార్జి పదవులు తరచూ మార్చేస్తూ పార్టీలో వర్గాలను కోరి అధినాయకత్వమే పెంచి పోషిస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి.

అర్జంటుగా ఆ రెండూ :

మిగిలిన వాటి గురించి మాట్లాడుకునే ముందు అర్జంటుగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి ఇంచార్జిలు కావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అవే భీమునిపట్నం, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గాలు అని అంటున్నారు. భీమునిపట్నం గురించి తెలిసిందే. సడెన్ గా అక్కడి వైసీపీ ఇంచార్జి చిన్న శ్రీను తప్పుకుని వైసీపీకి గుడ్ బై కొట్టేసి టీడీపీలో చేరిపోయారు. దాంతో భీమిలీకి అయిదవ క్రిష్ణుడు రాబోతున్నారు అని టాక్ నడుస్తోంది. ఇక్కడ మొదట కర్రి సీతారాం అనే మాజీ ఎమ్మెల్యేకు 2014లో టికెట్ ఇస్తే ఓటమి తరువాత కనిపించడం మానేశారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ చైర్మన్ అక్రమాని విజయనిర్మలకు బాధ్యతలు అప్పగించారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు, ఆమెను తెచ్చి విశాఖ తూర్పుకి మారిస్తే అక్కడ పార్టీలో అలజడి రేగి ఆమె ఓటమి పాలు అయ్యారు. ఇక అవంతి శ్రీనివాస్ 2019లో గెలిచి 2024లో ఓడిపోగానే వైసీపీకి రాజీనామా చేశారు. విజయనిర్మల కూడా 2024 ఎన్నికల ముందే పార్టీని వీడారు. దీంతో ఇపుడు ఇంచార్జిగా బయట వారు ఎవరూ వద్దు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ వైసీపీ నేతల నుంచి వస్తోంది.

బలమైన సామాజిక వర్గంతో :

ఇక భీమిలీలో మొత్తం 3 లక్షల ఓటర్లు ఉంటే అందులో అత్యధిక శాతం తూర్పు కాపులు ఉన్నారు. ఆ తరువాత యాదవులు, మత్స్యకారులు, నగరాలు, ఇతర బీసీ వర్గాలు ఉన్నాయి. దాంతో ఈసారి ఏ సామాజిక వర్గానికి వైసీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తుంది అన్నదే చర్చగా ఉంది. కాపులకే ప్రయారిటీ ఇస్తూ వచ్చిన వైసీపీ ఈసారి ఇతర బీసీ సామాజిక వర్గాల పేర్లను పరిశీలిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు స్థానికులు పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చూస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా అనేక ప్రయోగాలు చేసి విసిగిపోయిన వైసీపీ ఇప్పటికైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది అని పార్టీలో అంతా ఆలోచిస్తున్నారు.

పశ్చిమలో బోణీ లేదు :

ఇక వైసీపీ స్థాపించాక పశ్చిమలో కూడా పార్టీ బోణీ కొట్టలేదు. ఇక్కడ వరసగా మూడు ఎన్నికల్లో ముగ్గురికి టికెట్లు ఇచ్చారు. ముగ్గురూ గవర సామాజిక వర్గానికి చెందిన వారే. నియోజకవర్గంలో వారిదే సామాజికపరంగా రాజకీయంగా ఆధిపత్యం. అయితే టీడీపీ బలంగా ఉండడంతో పాటు వైసీపీ ప్రయోగాలు చివరి నిముషంలో ఎవరినో తెచ్చి అభ్యర్ధిగా ముందు పెట్టడంతో వారు ఎన్నికల తరువాత దూరం అవుతున్నారు. 2014లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడికి టికెట్ ఇస్తే ఓటమి తరువాత తప్పుకున్నారు. 2019లో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కి టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు. 2014లో టీడీపీ నుంచి వచ్చిన ఆడారి ఆనంద్ కి టికెట్ ఇస్తే ఓటమి తరువాత బీజేపీలో చేరిపోయారు. దాంతో మళ్ల విజయప్రసాద్ కే బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన మీద వ్యాపారపరమైన కేసులు ఉన్నాయని అంటున్నారు. ఆయన కూడా పార్టీకి సమయం వెచ్చించడం లేదు. దాంతో ఆయన ప్లేస్ లో బలమైన స్థానిక నేతకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. మరి ఎవరికి ఇస్తారో చూడాల్సి ఉంది.