Begin typing your search above and press return to search.

వైసీపీలో ఏం జ‌రుగుతోంది.. మ‌ళ్లీ మార్పులా.. ?

వైసీపీలో మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే మార్పులు చేర్పుల దిశ‌గా పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   18 Dec 2025 1:00 PM IST
వైసీపీలో ఏం జ‌రుగుతోంది..  మ‌ళ్లీ మార్పులా.. ?
X

వైసీపీలో మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే మార్పులు చేర్పుల దిశ‌గా పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మార్పుల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఐప్యాక్ స‌ర్వేపై ఆధార‌ప‌డిన జ‌గ‌న్‌.. ఎమ్మెల్యేల‌ను మంత్రుల‌ను కూడా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మార్పు చేయించారు. త‌ద్వారా ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఆ ప్ర‌యోగం విక‌టించింది. ఒక‌టి రెండు మార్పులు చేసి వ‌దిలేస్తే.. ప్ర‌జ‌లు అర్ధం చేసుకునే వార‌ని.. గుండుగుత్త‌గా 80 స్థానాల‌లో మార్పులు చేయ‌డం.. కీల‌క ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వ‌కుండా .. ప‌క్క‌న పెట్ట‌డం వంటివి అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇదే పార్టీకి మైన‌స్ అయింద‌న్న చ‌ర్చ కూడా సాగింది. అయితే..ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ ఇదే బాట ప‌డుతున్నారు. ఈ సారి కూడా భారీ ఎత్తున మార్పులు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పార్టీ నాయ‌కుల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. దీనిని భ‌ర్తీ చేసేందుకు కొత్త నాయ‌కుల‌ను త‌యారు చేయాల్సి ఉంది. అయితే.. పాత వారితోనే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో భ‌ర్తీ చేసేందు కు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ప‌దుల సంఖ్య‌లో నాయ‌కుల‌ను మార్చ‌డం ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో ఉన్నారు. ఇది కొంత మందికి న‌చ్చ‌డం లేదు. అయినా.. ఆల్ట‌ర్నేట్ పాలిటిక్స్ అందుబాటులో క‌నిపించడం లేక‌పోవ‌డంతో వారు అంత‌ర్మ‌థ‌నంలో చిక్కుకున్నారు.

మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొంద‌రిని ప‌క్క‌న పెట్టాల‌ని కూడా జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం స్త‌బ్దుగా ఉన్న నాయ‌కులు.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌లేని వారితో జాబితా రెడీ చేసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. ఇవ‌న్నీ.. పార్టీకి మేలు చేస్తాయ‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌గా.. ఇలాంటి ప్ర‌యోగాలు స‌రికాద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. ఇప్ప‌టి నుంచే నాయ‌కుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం ద్వారా.. పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో కూరుకుంటుందని కూడా చెబుతున్నారు.