Begin typing your search above and press return to search.

వైసీపీకి ప్రత్యక్ష గండం..పెను భారం ?

ఏపీలో విపక్ష వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ అంటోంది. అధినేత జగన్ అయితే ఎవరూ ఎక్కడా తగ్గకూడదని ఆదేశించారు.

By:  Satya P   |   12 Oct 2026 8:58 AM IST
వైసీపీకి ప్రత్యక్ష గండం..పెను భారం ?
X

ఏపీలో విపక్ష వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ అంటోంది. అధినేత జగన్ అయితే ఎవరూ ఎక్కడా తగ్గకూడదని ఆదేశించారు. ఏ ఊరిలోనూ ఏకపక్షం అన్న మాట వినిపించరాదని కూడా సూచించారు. అన్ని సీట్లకూ పోటీ చేసి తీరాల్సిందే అని కూడా జగన్ స్పష్టం చేశారు. ఇక ఏపీలో మేయర్ జెడ్పీ, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోనే వైసీపీ అధినాయకత్వం కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులను కోరుతోంది. ప్రత్యక్ష ఎన్నికలు అంటే అక్కడ అభ్యర్ధుల కంటే పార్టీ, జగన్ ఇమేజ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ విధంగా తమకు బలం ఉన్న చోట కష్టపడితే గెలవవచ్చు అన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది.

మోయలేనిదే మరి :

అయితే ప్రత్యక్ష ఎన్నికలు అంటే నేరుగా జనం ఓట్లతోనే మేయర్ జెడ్పీ చైర్మన్ వంటి జిల్లా స్థాయి పదవులు అందుకోవచ్చు. గెలిస్తే ఇక రాజ గౌరవమే. పైగా ఎవరూ దింపేందుకు కూడా ఏ మాత్రం చాన్స్ ఉండదు, అవిశ్వాసం బెడద అంతకంటే లేదు, దర్జాగా అయిదేళ్ళూ పదవిలో కొనసాగవచ్చు. అందుకే కూటమి నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది. పైగా మూడు పార్టీలు కలసి రంగంలోకి దిగుతున్నాయి. ఎంత ఖర్చు అయినా సిద్ధం అని కూడా కూటమి అభ్యర్ధుల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే గెలుపు గ్యారంటీ కాబట్టి. దాంతో అన్ని విధాలుగా అంగబలం అర్ధ్ బలంతో వారంతా సిద్ధపడుతున్నారు. అదే వైసీపీ వైపు చూస్తే తమకు ఇది మోయలేని భారమే అని పెదవి విరుస్తున్నారు.

సరి తూగేది ఎలా :

అటు వైపు అధికార పార్టీ, కూటమిగా వస్తున్నారు. అన్ని రకాలుగా సానుకూలత ఉంది. తాము ఒంటరి పోరు, అర్ధ బలం చూసుకోవాలి. ఎంత చేసినా ప్రజల మూడ్ స్థానిక ఎన్నికల్లో ఎపుడూ అధికార పక్షం వైపే ఉంటుంది. ఇంకా రెండున్నరేళ్ళు కూడా కాలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద మోజు ఉంటుంది. దాంతో పోటీ చేసి సవాల్ చేసిన గెలుపు కష్టమే అన్న భావన అయితే వైసీపీ నేతలలో ఉంది అని అంటున్నారు. దాంతో పోటీకి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు అని అంటున్నారు. మేయర్ జెడ్పీ చైర్మన్ పదవులకు పోటీకి చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆర్థిక భారమే దానికి కారణం అని చెబుతున్నారు.

హామీ ఇస్తేనే తప్ప :

అదే సమయంలో వైసీపీలో మరో మాట వినిపిస్తోంది. తాము పోటీకి సిద్ధపడతామని ఖర్చు విషయంలో అధినాయకత్వం పార్టీ నుంచి భరోసా వస్తే రెడీ అంటున్నారు. అంటే చాలా వరకూ పార్టీ నిధులు ఇచ్చి ముందుకు నడిపిస్తే పోటీకి సై అంటున్నారు అన్న మాట. అంతే తప్ప తాముగా సొంతంగా ఖర్చు పెట్టలేమని చేతులు కాల్చుకోలేమని చెబుతున్నారని టాక్. మరి వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో అభ్యర్ధులకు హామీ ఏ మేరకు ఇస్తుంది అన్నది చూడాలని అంటున్నారు. ఈ ఎన్నికలు వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకమనే అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే తమ ఓటు షేర్ ని కాపాడుకోవాలి. 2024 ఎన్నికల్లో వచ్చిన 40 శాతం షేర్ కంటే ఎంతో కొంత ఎక్కువ వచ్చిందని నిరూపించుకుంటే కనుక 2029 ఎన్నికల దాకా అది పొలిటికల్ గా ఆక్సిజన్ గా పార్టీకి పనిచేస్తుంది అని అంటున్నారు. అలా ఢీ కొట్టి పోరాడాలి అంటే అర్ధబలం అంగబలం ప్రధానం, హైకమాండ్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తుంది అన్నదే అంతా చూస్తున్నారు.