ఘర్ వాపసీ...వైసీపీ రివర్స్ షాక్ !
వైసీపీ నుంచి చాలా మంది నేతలు గత రెండేళ్ళుగా బయటకు పోయారు, వివిధ కారణాలతో అనేక మంది పార్టీకి గుడ్ బై కొట్టారు.
By: Satya P | 13 May 2026 9:23 AM ISTవైసీపీ నుంచి చాలా మంది నేతలు గత రెండేళ్ళుగా బయటకు పోయారు, వివిధ కారణాలతో అనేక మంది పార్టీకి గుడ్ బై కొట్టారు. ఫ్యాన్ నీడన తమకు ఉక్కబోతగా ఉందని చెప్పి మరీ తలాఖ్ అనేశారు. వైసీపీలో ఏళ్ళ తరబడి పనిచేసిన వారు పునాదుల నుంచి ఉన్న వారు వైఎస్సార్ కుటుంబంతో తరాలుగా పనిచేస్తున్న వారు కూడా పార్టీ గేటు దాటారు. ఇదంతా ఒక విధంగా ఆశ్చర్యంగా సాగింది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అయినా ఏ పార్టీకి అయినా మొదటి నుంచి ఉన్న వారు కొనసాగుతారు. అయారాం గయారాం ల విషయం అందరికీ ఎరుకే. కానీ పునాదుల నుంచి ఉన్న వారే వెళ్ళి పోవడం అంటే అది వైసీపీకి కలవరం కలిగించే అంశమే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
కీలక నేతలే వెళ్ళారు :
వైసీపీలో జగన్ తరువాత నంబర్ టూ అనిపించుకున్న విజయసాయిరెడ్డి పార్టీని వీడుతారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు, ఆయన పార్టీ నుంచి చాలా సైలెంట్ గా నిష్క్రమించారు. అలాగే వైసీపీతోనే సర్వం అనుకున్న మాజీ మంత్రులు మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు చాలా సులువుగా బంధాలను తెంపుకుని బయటకు వెళ్ళారు. ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీల జాబితా చూస్తే చాలానే ఉంది. అంతవరకూ ఎందుకు ఎమ్మెల్సీలుగా ఇంకా చేతిలో అధికారం ఉన్నా కూడా వైసీపీ వద్దు అని పదవులు సైతం వదులుకుని వెళ్ళిన వారూ ఉన్నారు. అయితే వీరంతా వైసీపీ భారీ ఓటమికి సంబంధించిన బాధలోనో లేక కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి సొంత ఇబ్బందుల వల్లనో వెళ్ళారని అంతా అనుకున్నారు. వైసీపీ అధినాయకత్వం కూడా అలాగే భావించి కొన్నాళ్ళకు అయినా వారంతా రిటర్న్ అవుతారు అని ఊహించింది.
మా సమస్యలు ఎందుకు :
అయితే ఇతర పార్టీలలో చేరి ఇబ్బందులు పడుతున్నా తాము వైసీపీలోకి తిరిగి వెళ్లేది లేదని చాలా మంది నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు అంటే వైసీపీ అంటే వారికి ఎంతటి వెగటు పుట్టిందో అర్థం కావడం లేదని అంటున్నారు. తాజాగా ఒంగోలు జిల్లా దిగ్గజ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే తాను ఎట్టి పరిస్థితిల్లోనూ వైసీపీ గడప తొక్కేది లేదని అన్నారు. తన భవిష్యత్తు అంతా జనసేనలోనే అని క్లారిటీ ఇచ్చారు. అయినా తనను టార్గెట్ చేసి తాను వైసీపీలోకి వస్తున్నారు అని ప్రచారం చేయిస్తున్నారు అని మండిపడ్డారు. తాను జనసేనలో ఒక వేళ ఇబ్బంది పడినా వైసీపీకి వచ్చిన నొప్పి ఏంటని బాలినేని ప్రశ్నించారు.
థర్డ్ ఫోర్స్ అంటున్న సాయిరెడ్డి :
వైసీపీ నుంచి వెళ్ళిన మరో కీలక నేత విజయసాయిరెడ్డి వీలైనపుడల్లా వైసీపీని విమర్శిస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని ఆయన జోస్యం చెబుతూ వస్తున్నారు. అంతే కాదు వైసీపీకి ఏపీని ఏలా అభివృద్ధి చేయాలో విజన్ లేదని లేటెస్ట్ గా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీకి వైసీపీకి ఆల్టర్నేషన్ గా థర్డ్ ఫోర్స్ రావాలని కూడా ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. ఇదే విషయం పదే పదే చెబుతున్నారు. దాంతో విజయసాయిరెడ్డి ఇదిగో అదిగో వచ్చేస్తున్నారు అని జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదే అని అంటున్నారు. ఇక ఇదే తీరున అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. వీరంతా తమకు ఇతర పార్టీలలో చాన్స్ లేకపోయినా ఓకే కానీ తిరిగి వైసీపీలోకి వెళ్ళమని అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
వచ్చేది ఎవరు :
ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి తరువాత పార్టీని పటిష్టం చేయాలని చూస్తోంది. చాలా చోట్ల పాత కాపులు లేక ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో అనుభవం ఉన్న వారు గతంలో పార్టీలో పనిచేసిన వారు వస్తే ఘర్ వాపసీ కింద ఓకే చెబుతారు అన్న ప్రచారం ఉంది. మరి వైసీపీలోకి వచ్చే నాయకులు ఎవరు అన్నదే చర్చగా ఉంది. చిత్రమేంటి అంటే చాలా మంది ఏ పార్టీలో చేరకుండా వెయిట్ చేస్తున్నారు మరి వీరిలో ఎవరైనా తిరిగి వైసీపీ వైపు వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
