బొత్సకు జగన్ ఓకేనా... మాజీ మంత్రుల సంగతేంటి ?
వైసీపీలో అపుడే వచ్చే ఎన్నికల మీద ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతోంది.
By: Satya P | 29 Sept 2025 9:14 AM ISTవైసీపీలో అపుడే వచ్చే ఎన్నికల మీద ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతోంది. ఇంకా మూడు వంతుల సమయం ఉంది. ఈ లోగా ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతాయి. కానీ వైసీపీలో మాత్రం ఆత్రం ఆరాటం పెరిగిపోతున్నాయి. పైగా ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్నారు. ఈసారి అక్కడ నుంచే రంగంలోకి దూకాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వారసుల ఎంట్రీ :
వైసీపీలో చూస్తే చాలా మంది నాయకుల సగటు వయసు ఆరు పదులు దాటింది. దాంతో వారు వచ్చే ఎన్నికల నాటికి తాము తప్పుకుని వారసులను సిద్ధం చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే అలా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ఎన్నికలు కురుక్షేత్రంగా జగన్ అభివర్ణించారు. దాంతో సీనియర్లే పోటీ చేయాలని ఆయన గట్టిగా కోరడంతో తప్పక బరిలోకి చాలా మంది దిగాల్సి వచ్చింది. కానీ ఈసారి వయసు పరిస్థితులు కూడా సహకరించవని చెబుతూ సీనియర్లు ఇప్పటి నుంచే వారసులను రెడీ చేస్తున్నారు. అలా ప్రముఖ నాయకుల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర కు చెందిన బొత్స సత్యనారాయణ తన కుమారుడిని 2029 ఎన్నికల్లో పోటీకి దించాలని అనుకుంటున్నారు అని చర్చ సాగుతోంది.
అక్కడ గురి పెట్టి మరీ :
తనను అనేక సార్లు గెలిపించిన చీపురుపల్లి నుంచే తన కుమారుడి రాజకీయ అరంగేట్రం ఉండాలని బొత్స భావిస్తున్నారు. దాంతో ఆయన ఈసారి దగ్గరుండి అన్నీ చక్కబెడుతున్నారు. ఎపుడూ పెద్దగా చీపురుపల్లి రాని బొత్స ఇపుడు మాత్రం వీలైనపుడల్లా అక్కడికి వస్తున్నారు తన రాజకీయ మంత్రాంగాన్ని నడుపుతున్నారు. పార్టీని పటిష్టం చేస్తున్నారు. క్యాడర్ కి తన కుమారుడిని పరిచయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్ధి అవుతారు అని కూడా చెప్పేస్తున్నారు. తన రాజకీయ్హ అనుభవాన్ని అంతా రంగరించి మరీ ఈసారి కుమారుడిని సక్సెస్ ఫుల్ గా చీపురుపల్లి నుంచి గెలిపించుకోవాలని చూస్తున్నారు.
క్యూలో చాలా మంది :
వైసీపీలో ఈసారి వారసుల హవా పెద్ద ఎత్తున ఉంటుంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే అది ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చూస్తే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, క్రిష్ణ దాస్ ల కుమారులు ఈసారి పోటీ చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు కూడా రంగంలోకి దిగాలని చూస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో చాలా మంది మాజీ మంత్రులు కొందరు ఇదే బాటలో వారసుల ఎంట్రీని కోరుతున్నారు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా :
మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆ జాబితాలో ఉన్నారు. తన కుమార్తెని ఆయన ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, అలాగే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, బూడి ముత్యాలనాయుడు వంటి వారు సిద్ధంగా ఉన్నారు. మరి జగన్ వీరందరికీ ఓకే చెబుతారా అన్న చర్చ సాగుతోంది. బొత్స అయితే అపుడే రంగంలోకి దిగిపోయి తన కుమారుడి కోసం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. మరి ఆయనకు జగన్ ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అని చర్చ సాగుతోంది. చూడాలి మరి ఎంత మంది వారసులు ఈసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో.
