Begin typing your search above and press return to search.

ఘర్ వాపసీ -వైసీపీ కొత్త ప్లాన్ ?

రాజకీయాలు అన్నాక ఒకే పార్టీని అట్టేబెట్టుకుని కొనసాగడం పాత కాలం రాజకీయం. అలా వార్డు మెంబర్ నుంచి మొదలెట్టి జీవిత చరమాంకంలో అయితే ఎమ్మెల్యే దాకా వచ్చేవారు.

By:  Satya P   |   29 March 2026 9:13 AM IST
ఘర్ వాపసీ -వైసీపీ కొత్త ప్లాన్ ?
X

రాజకీయాలు అన్నాక ఒకే పార్టీని అట్టేబెట్టుకుని కొనసాగడం పాత కాలం రాజకీయం. అలా వార్డు మెంబర్ నుంచి మొదలెట్టి జీవిత చరమాంకంలో అయితే ఎమ్మెల్యే దాకా వచ్చేవారు. కానీ ఇపుడు రాజకీయం అలా కాదు నేరుగా ఎమ్మెల్యే ఎంపీ, ఆ మీదట మంత్రి. ఇక అయిదేళ్ళ తరువాత తాము ఉన్న పార్టీ ఓటమి చెందితే అధికారంలో ఉన్న పార్టీ లోకి జంప్ చేయడం, తిరిగి ఎన్నికల వేళకు గాలి ఎటు వైపు వాలుగా ఉందో చూసుకుని తిరిగి ఆ వైపునకు రావడం. ఇదే పాలిటిక్స్ లో న్యూ ట్రిక్స్.

ఆ తానులో ముక్కలే :

దీనికి ఎవరూ అతీతం కాదు, పైగా రాజకీయాలు అంటే అత్యంత ఖరీదుగా మారిపోయాయి. నిబద్ధతతో ఉన్నా నమ్ముకుని కొనసాగినా పార్టీలూ పట్టించుకోవడం లేదు, జనాలూ ఆదరించడం లేదు. దాంతో ఎవరైనా ఇదే చేస్తున్నారు. సో ఇది ఏమంత కొత్త అయితే కాదు, అందరికీ అలవాటు అయిన వ్యవహారమే. అందువల్ల పార్టీని వీడి వెళ్ళిన వారిని చెడ్డగా ఎవరూ చూడడం లేదు, జనాలు సైతం ఇది రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నారు. పైగా తెలివి నేర్చిన పొలిటీషియన్ అని కితాబు ఇస్తున్నారు. మరి ఎవరికీ లేని పట్టింపు పార్టీల అధినేతలకు కూడా ఎందుకు అన్న చర్చ సాగుతోంది. ఇదంతా ఎందుకు అంటే వైసీపీ 2024 ఎన్నికలో ఘోరంగా ఓటమి పాలు అయిన తరువాత చాలా మంది నేతలు ఏపీ వ్యాప్తంగా కూటమి పార్టీల వైపుగా సాగిపోయారు. చాలా మంది కండువాలు మార్చేసుకున్నారు. అయితే అక్కడ వారు ఏమంత సుఖంగా లేరని టాక్ ఉంది. అంతే కాదు రేపటి రోజున టికెట్లు దక్కుతాయో లేదో అన్న బెంగ కూడా ఉంది అని అంటున్నారు.

గ్రీన్ సిగ్నల్ కోసం :

ఈ విధంగా ఫ్యాన్ నీడను దాటి కూటమి పార్టీల గూటికి చేరిన వారిలో జగన్ కి బంధువులు ఉన్నారు, అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. అలాగే మాజీ మంత్రులు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వీరంతా ఇపుడు పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా వైసీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో సీట్లు పెద్ద ఎత్తున పెరుగుతాయని టాక్ రావడమే. దాంతో వైసీపీలో చేరితే కచ్చితంగా తమకు టికెట్ దక్కుతుందని వారు భావిస్తున్నారుట. వైసీపీ అయితే సింగిల్ గా పోటీ చేస్తుంది. ఏ పార్టీతో పొత్తులు ఉండవు, పైగా 263 సీట్లకు అభ్యర్ధులు కావాలి. తమ సీనియారిటీ అనుభవం తో టికెట్లు తెచ్చుకుంటే పోటీ చేయడం సులువు గెలుపు కూడా సాధించగలమన్న నమ్మకంతో చాలా మంది ఘర్ వాపసీ అంటున్నారుట. అయితే దానికి వైసీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు.

అనివార్యంగానే :

ఇక వైసీపీ విషయం తీసుకుంటే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 263 మంది అంటే కొత్త వారిని తీసుకుని వచ్చి పోటీ చేయించవచ్చు. కానీ కూటమి బలంగా ఉంది. పైగా అధికారంలో ఉంటూ పోటీ చేస్తుంది. దాంతో అన్ని బలాలను తట్టుకోవాలీ అంటే సీనియర్లకు అనుభవం ఉన్న వారికే చాన్స్ ఇవ్వడం మేలు అన్న చర్చ సాగుతోందిట. పార్టీని విమర్శించకుండా ఓటమి బాధలోనో ఒత్తిళ్లలోనో లేక తమ సొంత వ్యాపారాల కోసమో పార్టీని వీడిన వారు తిరిగి వస్తామంటే చేర్చుకునేందుకు వైసీపీలోనూ సీరియస్ గానే చర్చ సాగుతోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే పెద్ద ఎత్తున వైసీపీ మాజీలు తిరిగి పార్టీలో చేరుతారు అని అంటున్నారు.