వైసీపీలో భరోసా బెడద.. అందుకే సైలెంటా ..!
వైసీపీలో నాయకులకు భరోసా బెడద వెంటాడుతోంది. పార్టీ పరంగా నాయకులకు మద్దతు కొరవడుతోంది. ఇది గత ఆరేడు మాసాలుగా జరుగుతున్న చర్చే అయినా.. ఇప్పుడు మరింతగా పెరిగిందని అంటున్నారు నాయకులు.
By: Garuda Media | 29 Nov 2025 9:00 PM ISTవైసీపీలో నాయకులకు భరోసా బెడద వెంటాడుతోంది. పార్టీ పరంగా నాయకులకు మద్దతు కొరవడుతోంది. ఇది గత ఆరేడు మాసాలుగా జరుగుతున్న చర్చే అయినా.. ఇప్పుడు మరింతగా పెరిగిందని అంటున్నారు నాయకులు. పార్టీ నాయకులను అక్కున చేర్చుకోవాల్సిన నాయకులు.. సమయం-సందర్భాన్ని బట్టి వారి తరఫున గళం వినిపించాల్సిన పార్టీ ఇప్పటి వరకు ఈ దిశగా అడుగులు వేయడం లేదన్నది వాస్తవం. దీంతో పార్టీలో నైరాశ్యం వెంటాడుతోంది.
ఒక నాయకుడికి మేలు జరిగితే.. మరింత నాయకులు బయటకు వస్తారు. కానీ.. ఒక నాయకుడికి నష్టమో కష్టమో వచ్చినప్పుడు.. పార్టీ పరంగా ఎలాంటి మద్దతు లభించకపోవడం, పార్టీ అధినేత తూతూ మంత్రం గా వ్యవహరించడం వంటివి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో టీడీపీ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు భరోసా నింపేలా వ్యవహరించారన్నది వాస్తవం. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చేవారు.
ఈ సమయంలో ఏదైనా కేసు నమోదై.. కార్యకర్తలు, నాయకులు జైలుకు వెళ్తే.. వారి తరఫున న్యాయ పోరాటం చేసేవారు. ఉద్యమాలు నిర్మించారు. రోడ్డెక్కారు. నిరసన చేపట్టారు. దీంతో పార్టీ కార్యకర్తలు.. తమ వెనుక కీలక నాయకులు ఉన్నారన్న భరోసాతో ఉండేవారు. పార్టీ కోసం పనిచేసేవారు. ఇది ఎన్నికల నాటికి కలిసి వచ్చింది. కానీ, వైసీపీ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా రివర్స్ అవుతోంది. పార్టీ తరఫున మాట్లాడుతున్న వారు.. కేసుల్లో చిక్కుకున్నా.. అధిష్టానం నుంచి ఆశించిన మేరకు మద్దతు లేకుండా పోయింది.
ఇటీవల వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. ఈ సమయంలో ఆయన తరఫున బలమైన వాదన ఎవరూ వినిపించలేదు. దీంతో తనకు పరిచయం ఉన్న వేరే పార్టీ నాయకుడి ద్వారా వెంకట రెడ్డి న్యాయసాయం పొంది.. బయటకు వచ్చారన్నది బహిరంగ రహస్యం. ఇలానే అనేక మంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు. అప్పట్లో పని చేసిన అధికారుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ పరిణామాలు గమనిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. `మనకెందుకు వచ్చింది`` అనుకుంటూ.. సైలెంట్ అయిపోతున్నారు. ఇది అంతిమంగా పార్టీకి తీరని నష్టం చేకూరుస్తోందని అంటున్నారు పరిశీలకులు.
