నేతల లెక్క: జగన్ అంటే 'మాటల'కే పరిమితమా..!
అయితే, పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ తరహా పరిస్థితి పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా నాయకులు చేస్తున్న వ్యవహారాలను గమనిస్తే జగన్ అంటే వారికి లెక్క లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
By: Garuda Media | 18 Oct 2025 2:00 PM ISTవైసీపీలో జగన్ అంటే తమ ప్రాణమని, తమ నాయకుడని చాలామంది నాయకులు చెబుతారు. ఆయన పేరును కూడా పచ్చబొట్టు పొడిగించుకున్న వాళ్ళు, ఉంగరాల్లో ఆయన ఫోటోను పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే, పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ తరహా పరిస్థితి పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా నాయకులు చేస్తున్న వ్యవహారాలను గమనిస్తే జగన్ అంటే వారికి లెక్క లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో కొత్త, పాత నాయకులు కూడా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరిన పోతిన మహేష్.. అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ వీరిద్దరూ కూడా తమ సొంత నిర్ణయాలకు కట్టుబడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇలాంటి నాయకులు చాలామంది రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ వీరిద్దరూ తరచుగా మీడియా ముందుకు వస్తూ ఉండడంతో వీరి విషయం చర్చకు వస్తుంది. వాస్తవానికి పోతిన మహేష్ కు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలను జగన్ అప్ప చెప్పారు. ఆ నియోజకవర్గంలో పార్టీని డెవలప్ చేయడంతో పాటు పార్టీ సమస్యలను, అంతర్గతంగా నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని ఇన్ చార్జిగా పోతిన మహేష్‌ను నియమించారు. కానీ, పోతన మహేష్ మాత్రం ఒకటి రెండు సార్లు మాత్రమే గుంటూరుకు వెళ్లి తిరిగి వచ్చారు.
ఆ తర్వాత ఆయన రాజకీయాలని విజయవాడలో ..అది కూడా ఆయన ఇంట్లో కూర్చుని మాత్రమే కొనసాగిస్తున్నారు. మరి దీన్ని బట్టి జగన్ అంటే ఆయనకు గౌరవం ఉందా లేకపోతే ఆయన సొంత నిర్ణయాలకే కట్టుబడి వ్యవహరిస్తున్నారా అనేది చూడాలి. ఈ విషయంలో పార్టీ కూడా పట్టించుకోనట్టే వ్యవహరిస్తుంది. ఇక మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయనను విజయవాడకు ఇన్చార్జిగా నిర్మించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని సమస్యలు, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులను కలుసుకోవడం.. వారందరినీ ఏకృతం చేయడం సభలు సమావేశాలు పెట్టడం ప్రభుత్వంపై ఒకరకంగా ఉద్యమం తరహాలో స్పందించడం వంటివి లక్ష్యాలుగా నిర్దేశించారు.
కానీ మోదుగుల వేణుగోపాల్ మనసంతా గుంటూరు పైనే ఉంది. దీంతో వేణుగోపాల్ గుంటూరు కే పరిమితమవుతున్నారు. ఏ కార్యక్రమం జరిగినా గుంటూరులోని నిర్వహిస్తున్నారు. ఇటీవల మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించినప్పుడు కూడా ఆయన వాస్తవానికి విజయవాడకు రావాలి. విజయవాడలో నాయకులను కలుపుకుని కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ, గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు. మహేష్ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నాయకులు ఇలా వారి సొంత పెత్తనాలు చేస్తే ఇక జగన్ చెప్పిందానికి, జగన్ పెట్టుకున్న ఆశలకు విలువ ఏముంటుంది అన్నది ప్రశ్న.
