Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల 'సింప‌తీ' పాలిటిక్స్‌.. !

తాజాగా జరిగిన అంబటి రాంబాబు ఎపిసోడ్ అయినా జోగి రమేష్ కొనసాగిస్తున్న దూకుడు వ్యవహారాన్ని గమనించినా ఇవే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

By:  Garuda Media   |   3 Feb 2026 8:00 AM IST
వైసీపీ నేత‌ల సింప‌తీ పాలిటిక్స్‌.. !
X

వైసీపీ నేతలు సింపతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. ఎలాగూ వ్యక్తిగతంగా తాము పుంజుకో లేమని భావిస్తున్న కొందరు నాయకులు ప్రజల్లో సింప‌తీ కోసం సీఎం చంద్రబాబును టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు అలాగే మేధావులు కూడా సింపతి రాజకీయాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ నాయకులు చాలామంది మౌనంగా ఉన్నారు.

కానీ అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి ముఖ్య నాయకులు అదేవిధంగా పేర్ని నాని వంటి మాజీ మంత్రులు ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని అలాగే మంత్రి నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకునే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వెనుక వారి ఉద్దేశం వివాదాల సృష్టించడంతోపాటు ఈ వివాదాల కారణంగా జైలు పాలు అయితే అది తమకు లాభిస్తుందన్న ఉద్దేశం కనిపిస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

అంతేకాదు సింపతి సంపాదించుకునే క్రమంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఎలాగూ తమను జైలుకు పంపిస్తారని తమపై కేసులు నమోదవుతాయని భావిస్తున్న నాయకులు ఈ దూకుడు మరింత పెంచుతున్నారని అంటున్నారు. తాజాగా జరిగిన అంబటి రాంబాబు ఎపిసోడ్ అయినా జోగి రమేష్ కొనసాగిస్తున్న దూకుడు వ్యవహారాన్ని గమనించినా ఇవే విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వారిద్దరూ గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో పార్టీ పరంగా చూస్తే ఇప్ప‌ట్లో అది పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.

కాబట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించటం, అదేవిధంగా చంద్రబాబును టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తే అది తమకు ఇమేజ్ తీసుకొస్తుందని ఘర్షణ పూరిత వాతావరణంలో తమకు సింపతి పెరుగుతుందని తామ జైలుకు వెళ్తే మరింతగా ప్రజల్లో తమ ఇమేజ్ పెరుగుతుందని ఒక అనాలోచితమైన కార్యక్రమాలకు తెర‌దీస్తున్నారని చెబుతున్నారు. మరి ఇది ఏ పార్టీకైనా లభిస్తుందా అంటే లాభించ‌ద‌నే చెప్పాలి. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లేనంత మాత్రాన గెలిచారా అంటే జైలుకు వెళ్లనంత మాత్రాన ఆయన గెలవలేదు.

ఆయన పై పెట్టిన కేసును ప్రజలు విశ్వసించలేదు కాబట్టి ప్రజలు ఆయన పట్ల అభిమానంతో ఉన్నారు కాబట్టి అది సింపతీగా మారి టిడిపికి గెలిచే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుత పరిణామాల్లో అటు అంబటి రాంబాబు అయినా ఇటు జోగు రమేష్ అయినా ఎలాంటి మాటలు అంటున్నారు చంద్రబాబును ఆయన కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోనూ తీవ్ర నిరోత్సాహానికి తీవ్ర అగ్రహానికి కూడా గురయ్యేలా చేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సింపతి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయినా ఇలాంటి పరిస్థితులను సభ్య సమాజం సహించదు. రాజకీయంగా ఎదుర్కో లేకపోతే వేరే మార్గంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వారి హవాను పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు, నోరు పారేసుకోవ‌డం ద్వారా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి దానిని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ నేత ల పరిస్థితి ఇంతే అన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.