సీనియర్లు అంతా ఢిల్లీకేనట !
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి గట్టిగా ఏణ్ణర్థం కాలేదు. ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు మాత్రమే అయింది.
By: Satya P | 19 Oct 2025 1:00 AM ISTఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి గట్టిగా ఏణ్ణర్థం కాలేదు. ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు మాత్రమే అయింది. అయితే 2029 ఎన్నికల మీదనే ఎన్నో కలలతో రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ఈ విషయంలో సహజంగానే విపక్షాలకు చెందిన వారిదే పైచేయిగా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో లేకపోవడంతో ఉందిలే మంచి కాలం అని వారు అంతా సర్దిచెప్పుకుంటూ పోతారు. అంతే కాదు ఇప్పటి నుంచి సేఫ్ జోన్ ని రెడీ చేసుకుని పెట్టుకుని మరీ ఫ్యూచర్ ప్లాన్స్ ని పండించుకునే పనిలో పడుతున్నారు.
సీనియర్ల ప్లాన్ :
వైసీపీలో చూస్తే చాలా మంది సీనియర్ల ప్లాన్ ఈసారి మారుతోంది. ఎలా అంటే తమ వారరులను అసెంబ్లీకి పంపించడం ద్వారా తాము ఎంపీలుగా ఢిల్లీకి వెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల రెండిందాలుగా లాభపడవచ్చు అన్నదే సీనియర్ల మనోగతంగా ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలెడితే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటు మీద గురి పెట్టారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. తమ కుమారుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే సీటు ఇచ్చి తాను ఎంపీగా సిక్కోలు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అదే బెస్ట్ రూట్ :
ఇక విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. తన సొంత సీటు చీపురుపల్లిని తన కుమారుడు సందీప్ కి ఇచ్చేసి తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. బొత్స విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన చాలా కాలంగా తన రాజకీయం అంతా విశాఖ కేంద్రంగా నడిపిస్తున్నారు. దాంతో ఆయన చూపు అలా పడింది అని అంటున్నారు. తన మేనల్లుడిని భీమిలీ నుంచి పోటీ చేయించడం కూడా అందుకోసమే అంటున్నారు.
వీరి సంగతేంటి :
ఇక పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అరకు ఎంపీ సీటు మీద కన్నేశారు అని అంటున్నారు. ఆయన 2024లోనే పోటీ చేయాలని చూసినా అధినాయకత్వం ఆలోచనలతో వెనక్కి తగ్గారు అని అంటున్నారు. ఈసారి మాత్రం పక్కా అని తేల్చేస్తున్నారుట. విజయనగరం ఎంపీ సీటు మీద పలువురు సీనియర్ల కన్ను ఉంది అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈసారి ఎమ్మెల్యే కాదు ఎంపీ అని అంటున్నారు. అదే విధంగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా వీలైతే మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీకి రెడీ అవుతారు అని తన కుమారుడికి అసెంబ్లీ సీటు ఇప్పించుకుంటారు అని అంటున్నారు.
యువతకు చాన్స్ :
ఇక మాజీ మంత్రి పినిశె విశ్వరూప్ అమలాపురం నుంచి ఎంపీగా పోటీకి దిగుతారు అని అంటున్నారు. రాయలసీమలో అయితే సీనియర్ నేతలు అనుకునే వారు అంతా ఎటూ అసెంబ్లీకి యూత్ ని పార్టీ హై కమాండ్ ఆలోచిస్తుంది కాబట్టి ఎంపీగా టికెట్ కోరితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారుట. పెద్దిరెడ్డి ఫ్యామిలీలో మిధున్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజం పేట ఎంపీగా పెద్దిరెడ్డి దిగుతారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి ఢిల్లీకి వెళ్ళాలని సీనియర్లు కోరుకుంటున్నారు. మరి వైసీపీ ఆలోచనలు కూడా యువతకు చాన్స్ అన్నట్లుగా ఉండడంతో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏవి నిజాలు అవుతాయో.
