అటు గోదావరి...ఇటు ఉత్తరాంధ్ర...వైసీపీ నయా వ్యూహం !
వైసీపీ గోదావరి జిల్లాలలో రాజకీయ కాపుదల కోసం చూస్తోంది. కాపులదే రాజకీయం ఇక్కడ అన్నది 2024 ఎన్నికల్లో వైసీపీ గుర్తించడంలో విఫలం అయింది.
By: Satya P | 23 July 2026 9:23 AM ISTవైసీపీ రాజకీయం ఇపుడు చర్చకు తావిస్తోంది. ఒక వైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద నిత్యం విమర్శలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తూ జనంలో రచ్చ చేస్తున్న వైసీపీ అదే సమయంలో పోయిన చోటనె వెతుక్కునేందుకు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. కాపులను తిరిగి దగ్గరకు తీసుకోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఆ పార్టీ నుంచి అధికమయ్యాయని అంటున్నారు. వైసీపీ ఏకంగా డెబ్బై సీట్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు. ఈ డెబ్బై సీట్లలో మెజారిటీని వచ్చే ఎన్నికల్లో గెలుచుకుంటేనే 2029లో తిరిగి అధికారం దక్కుతుందన్నది వైసీపీ భారీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.
గోదావరితో కాపు :
వైసీపీ గోదావరి జిల్లాలలో రాజకీయ కాపుదల కోసం చూస్తోంది. కాపులదే రాజకీయం ఇక్కడ అన్నది 2024 ఎన్నికల్లో వైసీపీ గుర్తించడంలో విఫలం అయింది. దానికి గానూ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ పొందలేకపోయింది. దానికి తోడు జనసేన ప్రభావం కానీ పవన్ చరిష్మాను కానీ అంచనా కట్టలేకపోయింది. వైసీపీకి బలమైన కాపు నేతలు ఉన్నా ఇతర సామాజిక వర్గాలను ముందుకు తెచ్చి కాపు జిల్లాలలో ఆధిక్యం చూపిద్దామనుకున్న భంగపడింది. దాంతో ఇపుడు గోదవారి జిల్లాలలో రిపేర్లు వైసీపీ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ ఆక్వా రైతుల పరామర్శను కూడా చూడాలని అంటున్నారు.
ముద్రగడ లేని లోటు :
మరో వైపు చూస్తే కాపుల ఐకాన్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం మృతి చెందడం వైసీపీకి గోదావరి జిల్లాలలో తీరని లోటుగా ఉంది. అదే సమయంలో ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులను ఎక్కడికక్కడ ప్రోత్సహించడంతో పాటు ముద్రగడ పట్ల జనంలో ఉన్న సానుభూతిని ఏకపక్షంగా తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ పెద్దలు చూస్తున్నారు. ఇక అధినేత జగన్ ఏకంగా ముద్రగడ అంత్యక్రియలలో పాల్గొని ఏకంగా ఆయన పాడె సైతం మోసిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా విశేషంగా చూస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభకు మొత్తం వైసీపీ కాపు నేతలు అంతా హాజరు కావడం రానున్న రోజూల్లో గోదావరి జిల్లాలలో ముద్రగడ పేరుతో రీసౌండ్ చేయడానికి వైసీపీ రెడీ అయింది అన్న సంకేతాలను ఇస్తోంది అని అంటున్నారు.
త్వరలో భారీ సభతో :
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వైసీపీ నయా ప్లాన్ తో సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఈ మూడు జిల్లాలలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు వారిని మచ్చిక చేసుకుని వైసీపీతో మమేకం చేయడానికి వైసీపీ భారీ యాక్షన్ ని రెడీ చేసి పెట్టింది. తొందరలోనే ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపులతో ఒక భారీ సభను వైసీపీ నిర్వహించబోతోంది అని అంటున్నారు. ఈ సభలో తూర్పు కాపులను ఆకట్టుకునే విధంగా వైసీపీ హామీలు ఉంటాయని అంటున్నారు. అలాగే వారికి రాజకీయ భరోసాతో పాటు వైసీపీతో ఉండేలా చేసేందుకు బొత్స సత్యనారాయణ వంటి వారు రంగంలోకి దిగుతున్నారు.
అధికారానికి ఇదీ లెక్క :
ఇక ఉత్తరాంధ్రాలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో మరో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే 68 అవుతాయి. 2029 నాటికి ఇందులో కనీసంగా 40 దాకా సీట్లు అయినా వైసీపీ గెలుచుకుంటే గ్రేటర్ రాయలసీమలో ఉన్న 74 సీట్లలో 50 సీట్లకు తక్కువ లేకుండా గెలిస్తే ఇక మధ్య కోస్తాంధ్రాలో మరో పది నుంచి పదిహేను దాకా రాబట్టుకుంటే మంచి మెజారిటీతో అధికారంలోకి రావచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.
