Begin typing your search above and press return to search.

వైసీపీ కాపు స్ట్రాటజీ...కార్నర్ చేస్తూ !

ఇక తమ తప్పులు ఏమిటో వైసీపీ నేతలు ఎవరూ బాహాటంగా చెప్పరు. ఇక అధినాయకత్వం కూడా కూటమి మీదనే విమర్శలు తప్పించి ఆత్మ విమర్శ చేసుకోదు అని అంతా అనుకుంటున్నారు.

By:  Satya P   |   20 Jun 2026 8:00 AM IST
వైసీపీ కాపు స్ట్రాటజీ...కార్నర్ చేస్తూ !
X

పోయిన చోటనే వెతుక్కోవాలని ఒక ముతక సామెత. దీనిని ఎంతవరకూ జన సామాన్యం పాటిస్తుందో తెలియదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం కచ్చితంగానే ఫాలో అవుతాయి. వారికి ఎపుడూ పోయేది అధికారం. తిరిగి దానిని తెచ్చుకోవడమే వారి వ్యవహారం. ఆ సమయంలో సరిగ్గా పాత సామెతనే వారు పదే పదే గుర్తు చేసుకుంటారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఏపీలో 2024 ఎన్నికల్లో దారుణంగా నష్టపోయింది. మితిమీరిన అతి విశ్వాసంతో నేల విడిచి చేసిన సాము గారెడీకి జనాలు ఇచ్చిన సీట్లు 11 మాత్రమే. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా వైసీపీ చతికిలపడి పోయింది. ఇక తమ తప్పులు ఏమిటో వైసీపీ నేతలు ఎవరూ బాహాటంగా చెప్పరు. ఇక అధినాయకత్వం కూడా కూటమి మీదనే విమర్శలు తప్పించి ఆత్మ విమర్శ చేసుకోదు అని అంతా అనుకుంటున్నారు. కానీ వైసీపీ హైకమాండ్ ఓటమిని బాగానే పోస్ట్ మార్టం చేసింది అని ఆ పార్టీ రాజకీయ వ్యూహాలే స్పష్టం చేస్తున్నాయి.

కాపులకు దగ్గరగా ఉంటూ :

వైసీపీ 2019లో గెలవడానికి 2024 లో ఓడడానికి తమ ఇమేజ్ బలం వ్యూహాలతో పాటు కాపులు కూడా ఒక ప్రధాన కారణం అని గుర్తు చేసుకుంటోంది. కాపు ఓట్లు గుత్తమొత్తంగా కూటమికి పడిపోయాయని కూడా గ్రహించింది. అందుకే కోస్తా జిల్లాలలోని 101 సీట్లలో ఒక్క సీటూ దక్కలేదని కూడా వైసీపీకి అర్ధం అయింది. ఈ క్రమంలో కాపులకు దగ్గర కావాలని వైసీపీ పక్కా వ్యూహమే రచించింది. కాపులు కనుక తమతో ఉంటే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలలో మంచి విజయం ఖాయం అని గట్టిగా నమ్ముతోంది. దాంతోనే వైసీపీలో చాలా కాలంగా కాపులకు అతి ప్రాధాన్యత ఇస్తోంది. వారినే ముందు పెట్టి కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయిస్తోంది.

మారుతున్న పరిణామాలు :

ఎవరు కాదనుకున్నా ఏపీలో రాజకీయం మొత్తం కులాల సమాహారం. కులం బట్టే రాజకీయం సీట్లూ ఓట్లూ అన్నీ ఉంటాయి. అయితే జనసేన వైపు ఉన్న కాపులు కూటమిని కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరగడం లేదని వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కాపు నేతలు అదే పనిగా కూటమిని టార్గెట్ చేస్తున్నారు. ఇక కాపుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలను కూడా వైసీపీలో ఉన్న కాపు నాయకులే చొరవ తీసుకుని నిర్వహిస్తున్నారు. దానికి వైసీపీ అధినాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అని అంటున్నారు. తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం పెడితే శ్రీకాకుళం వెళ్ళి వచ్చారు సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఇపుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సీనియర్ నేత తోట త్రిమూర్తులు 21న కాపుల కోసం సమావేశం పెడుతున్నారు. దీనిని వైసీపీకి చెందిన కాపు నేతలు మొత్తం హాజరవుతున్నారని అంటున్నారు.

కూటమి చర్యలు సైతం :

ఇక కూటమి ప్రభుత్వ చర్యలు కూడా వైసీపీకి కలసి వస్తున్నాయని అంటున్నారు. కాపు కార్పోరేషన్ కి నిధులు కేటాయించకపోవడం కాపులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేకపోవడం రాజకీయంగా తమకు తగిన నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో కాపు సామాజిక వర్గం రగులుతోంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటనలు కూడా వారికి బాధను కలిగించాయి. తనకు కులం ముద్ర వద్దని పవన్ చెప్పడం కూడా కాపులకు మనస్తాపం కలిగిస్తే వైసీపీకి అది రాజకీయ వరంగా మారుతోంది అని అంటున్నారు. ఇక కాపు యువకుడు సాయి క్రిష్ణ లాకప్ డెత్ అంటూ వార్తలు రావడంతోనే వైసీపీ మొత్తం ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడం ఆఖరుకు జగన్ కూడా వెళ్లడంతో కాపుల విషయంలో వైసీపీ స్ట్రాటజీ ఏంటి అన్నది కూడా చర్చ సాగుతోంది.

అయిదేళ్ళకు ఒక మారు :

ఇక ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రా కాపులు ప్రతీ అయిదేళ్లకు ఒకసారి అధికారం మార్పిడి చేస్తారు. ప్రభుత్వం మారడం వెనక వీరే కీలకంగా ఉంటారు. 2014లో టీడీపీ గెలిచినా 2019లో వైసీపీ గెలిచినా 2024 లో కూటమి గెలిచినా ఈ జిల్లాలే కారణం. అందుకే ఈ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా 2029 ఎన్నికల్లో మరోసారి గెలిచి జెండా పాతాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ కూటమి ఏ విధంగా రెడీ చేస్తుందో చూడాల్సి ఉంది.