వైసీపీకే ఆప్షన్ ఇస్తున్న బిగ్ షాట్... హామీ ఇవ్వాల్సిందేనా ?
ఇక తాజాగా చూస్తే ఆయన అనుచరులు మండల స్థాయి నేతలు కొందరు జిల్లా పార్టీ అధినాయకత్వాలకు టచ్ లోకి వచ్చారుట.
By: Satya P | 30 July 2026 9:35 AM ISTవైసీపీ పరిస్థితి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో ఎలా ఉంది అంటే కొన్ని చోట్ల గట్టి నేతలు కనిపించడం లేదు. మరి కొన్ని చోట్ల ఒకరికి మించి బలమైన నేతలు ఉన్నారు. గట్టి నేతలు లేని చోట పార్టీని బలోపేతం చేసుకోవడం ఒక సమస్య అయితే బలమైన నేతలు ఉన్న చోట వర్గ పోరుని తీర్చి కో ఆర్డినేషన్ చేయడం వైసీపీకి తలకు మించిన భారం అవుతోంది. ఇదే వైసీపీకి ఎక్కువగా దెబ్బ తీస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే బలమైన నేతలు అంతా ఏదో కాడికి కలిస్తే పార్టీకి గెలుపు చాన్స్ ఉంటుంది. కానీ వారు కలహించుకోవడంతోనే 2024 లో చాలా చోట్ల చేదు ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కానీ వైసీపీకి అది చేతకాక దెబ్బ తింటోంది అని అంటున్నారు. అలాంటి నియోజకవర్గాలలో చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు ఒకటి అని అంటున్నారు. ఇక్కడ వైసీపీకి బలమైన నేతలు ఉన్నారు. పార్టీకి బలం ఉంది కానీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.
మాజీ మంత్రి యాక్టివ్ :
ఇక్కడ 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ బలమైన నేత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీంధర్ రెడ్డికి మొండి చేయి చూపించింది. దాంతో ఆయన ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారు. దాంతో ఇక్కడ వైసీపీ ఓటమి పాలు అయింది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి ఇంచార్జిగా బుర్రావే వ్యవహరిస్తున్నారు. 2029 లో ఆయనే పోటీ చేస్తారు అని అంతా అనుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి మహీందర్ రెడ్డి మీద రకరకాలుగా ప్రచారం సాగుతూ వచ్చింది. ఆయన జనసేనలో చేరుతారని కొందరు, ఆయన టీడీపీ గూటికి వెళ్తారు అని మరి కొందరు ప్రచారం చేశారు. ఇక మానుగుంట 1989లో తొలిసారి గెలిచారు. తిరిగి 2004, 2009లలో గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2019లో వైసీపీలో చేరి గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా దక్కలేదు, ఆ అసంతృప్తి అలా ఉండగానే 2024లో టికెట్ కూడా దక్కలేదు. దాంతో ఆయన ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్నా మళ్ళీ ఇపుడు యాక్టివ్ అవుతున్నారు అని టాక్ నడుస్తోంది.
హామీ ఇస్తే సీన్ లోకి :
ఇక తాజాగా చూస్తే ఆయన అనుచరులు మండల స్థాయి నేతలు కొందరు జిల్లా పార్టీ అధినాయకత్వాలకు టచ్ లోకి వచ్చారుట. తమ నాయకుడికి హామీ ఇస్తే తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధం అని ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూడా కలసి చెప్పి ఉంచారుట. దీని మీద వారు అధినాయకత్వం దృష్టిలో పెట్టే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఇతర పార్టీల వైపు చూడకుండా వైసీపీలోనే తిరిగి పనిచేయాలని మానుగుంట వర్గీయులు భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ పరిణామాలతో కందుకూరు ఇంచార్జి బుర్రా మధుసూదన్ వర్గీయులు మండిపోతున్నారుట. ఇదంతా పార్టీలో అయోమయం క్రియేట్ చేయడానికే అని అంటున్నారుట. 2024 ఎన్నికల్లో తమ నేత ఓటమి పాలు కావడానికి మాజీ మంత్రి వర్గీయులు సరిగ్గా పనిచేయకపోవడం కారణం అని వారు ఆరోపిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే మానుగుంట జిల్లా స్థాయి నేత, మాజీ మంత్రి బిగ్ షాట్. ఆయనే ఆప్షన్ ఇచ్చారని అంటున్నారు. కాదని అంటే వేరే పార్టీలో చేరితే వైసీపీకి అది భారీ షాక్ అని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
