బిగ్ బ్రేకింగ్... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్!
అవును... నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టయ్యారు.
By: Raja Ch | 2 Nov 2025 9:41 AM ISTఏపీ రాజకీయాల్లో నకిలీ మద్యం తయ్యారీ కేసు ఎంత సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టయ్యారు. ఆయనతో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు.
అవును... నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టారని జనార్దన రావు చెప్పారని అంటున్నారు.
ఇదేసమయంలో... చిత్తూరు జిల్లాకు చెందిన ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టమని జోగి రమేష్ తనకు సూచించారని పోలీసులకు జనార్దనరావు చెప్పినట్లు తెలిసింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని చెప్పినట్లు సమాచారం.
దీనికి సంబంధించిన ఇంటరాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు అధికారులు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా జోగి రమేష్ ఆరోపించారు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.
