యనమల ఊర మాస్ ర్యాగింగ్.. జగన్ పాదయాత్రపై ఏం చెప్పారో తెలుసా?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
By: Tupaki Political Desk | 22 Jan 2026 1:48 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరో ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేస్తానంటూ బుధవారం జగన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి, ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటానని జగన్ రెడ్డి ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కూటమి పార్టీలు జగన్ ప్రకటనపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎంపై మాటల దాడి చేయడంలో ముందుండే సీనియర్ నేత, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్ష్యంగా యనమల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి పదవీ కాంక్షతోనే పాదయాత్ర చేస్తానంటున్నారని మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ రెడ్డి పనిచేస్తారని యనమల వ్యాఖ్యానించారు. జగన్ ను ఒకసారి సీఎం చేయడం వల్లే రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ల వెనక్కి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల వైఫల్యంతో రాష్ట్రం నిండిపోయిందని మండిపడ్డారు యనమల.
జగన్ పాలనలో ప్రజలు ఇప్పటికే నానా కష్టాలు పడ్డారని, జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే గుర్తొస్తాయని యనమల విరుచుకుపడ్డారు. నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం కలిగిన వ్యక్తి అంటూ మాజీ ముఖ్యమంత్రిపై యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రవర్తన హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో ఉంటుందని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పేశారు. జగన్ పాదయాత్ర ప్లాన్ పై టీడీపీ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే కావడం విశేషం.
కాగా, 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డి 151 సీట్లతో ఘన విజయం సాధించారు. అయితే ఐదేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకు వస్తున్నారు. తన పర్యటలతో పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయన జనంలో తిరిగే సమయం తక్కువగా ఉండటం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండటం లేదని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి పాదయాత్ర ప్రకటన వైసీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపింది. దీనిపై అధికార పక్షం సహజంగానే విమర్శలు గుప్పిస్తుందని అంటున్నారు. అయితే సీనియర్ నేత యనమల స్పందన ఘాటుగా ఉండటమే చర్చనీయాంశం అవుతోంది.
