జగన్... 'సానుభూతి'పైనే వైసీపీ 'ఆశలు'
వైసీపీ ఆశలన్నీ.. జగన్ చేపట్టబోయే పాదయాత్రపైనే ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
By: Garuda Media | 17 Jan 2026 9:45 AM ISTవైసీపీ ఆశలన్నీ.. జగన్ చేపట్టబోయే పాదయాత్రపైనే ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తద్వారా సానుభూతిని అందిపుచ్చుకుని.. 2029 ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు ప్రయ త్నించాలని చూస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ఆది నుంచి కూడా సానుభూతి రాజకీయాలనే ఎక్కువగా నమ్ముకుంది. ఓదార్పు యాత్రల నుంచి పాదయాత్రల వరకు .. జగన్ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే 2019లో విజయం దక్కించుకున్నారు. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు. అయి తే.. ఆయన పాలన ఎలా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు జగన్ అంటే.. భయం వేసేలా ప్రజలకు దడ పుట్టించాయి. ఫలితంగా 2024లో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మరోసా రి అదే సానుభూతి కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం మంచిదే అయినా.. ప్రజల్లో సానుభూతి వస్తుందా? అనేది ప్రశ్న.
ఓటమి తర్వాత.. నాయకుల్లో మార్పు రావాలి. కానీ, జగన్‌లో ఆ తరహా మార్పు ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లన్నట్టుగా అమరావతి విషయంలో వ్యవహరిస్తున్న తీరు పార్టీని, నాయకుడిని కూడా డైల్యూట్ చేస్తున్నాయి. ఇక, పార్టీ కార్యాలయం కూడా ఇప్పటికీ.. కొందరికి మాత్రమే పరిమితం అయింది. వీటిని మార్చకుండా.. ప్రజల మధ్యకు వచ్చినా.. ప్రయోజనం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అంతేకాదు.. గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను వ్యంగ్యంగా కొట్టి పారేసిన జగన్.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే హామీలను అమలు చేస్తున్న విధానం చూస్తున్నారు. వీటిని బట్టి.. భవిష్యత్తులో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది ప్రశ్న. కేవలం సానుభూతి మాత్రమే ఓట్లు రాల్చే పరిస్థితి ఇప్పుడు ఏపీలో లేదు. బలమైన కూటమి నాయకులు.. పాలన ఉన్నప్పుడు.. దానికి మించి అన్నట్టుగా జగన్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది లేకుండా పాదయాత్ర చేసినా.. ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.
