Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చేయాల్సింది చాలానే ఉంది.. !

వైసీపీ అధినేత జగన్ చేయాల్సింది చాలానే ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By:  Garuda Media   |   8 Jan 2026 1:00 AM IST
జ‌గ‌న్ చేయాల్సింది చాలానే ఉంది.. !
X

వైసీపీ అధినేత జగన్ చేయాల్సింది చాలానే ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన కీలక కార్యక్రమం మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో నిర్మించడానికి వ్యతిరేకిస్తూ చేపట్టిన రాష్ట్రస్థాయి సంతకాల సేకరణ. వాస్త‌వానికి చెప్పాలంటే ఇది కూడా క్షేత్రస్థాయి నాయకులే చేశారు. జగన్ అడుగు తీసి బయట కూడా పెట్టలేదు. సంత‌కాల సేక‌ర‌ణ కోసం తన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించలేదు.

అయినా మొత్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎదో ఆలా ఆలా కానిచ్ఛేసారని చెప్పాలి. అయితే దీనివల్ల వైసిపికి గ్రాఫ్ పెరిగిందా అధికార పార్టీలకు తగ్గిందా అనే విషయాన్ని పక్కనపెడితే మొత్తంగా వైసిపి ఒక కీలక కార్యక్రమం అయితే నిర్వహించిందనేది వాస్తవం. మరి ఇక్కడతో సరిపెడతారా అంటే గత ఏడాది కాలాన్ని చూసుకున్నట్లయితే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీకి కొంత ఊపు తెచ్చింది అనడంలో సందేహం లేదు.

కానీ, ఈ ఒక్క కార్యక్రమం ఏడాది మొత్తానికి సరిపెట్టడమే విమర్శలకు దారి తీస్తోంది. రైతులను పరామర్శించేందుకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు గత ఏడాది కాలంలో రెండు మూడు సార్లు మాత్రమే జగన్ ప్రజల మధ్యకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయన బెంగళూరు కె పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు అన్నది కీలకంగా మారింది. కొన్నాళ్ల కిందట ఇదే విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2026లో పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి క్యాలెండర్ ముందుగానే విడుదల చేస్తామన్నారు.

దాని ప్రకారం నాయకులు, కార్యకర్తలు ఆ కార్యక్రమాలకు సిద్ధం కావాలని చెప్పుకొచ్చారు. కానీ 2026 వచ్చేసి పది రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు వైసీపీ తరఫున ఈ సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల జాబితా అయితే సిద్ధం కాలేదు. దీంతో బలమైన కార్యక్రమాలు చేపడతారా లేకపోతే ఇలానే ఉంటారా అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ ఏడాది వైసీపీకి అత్యంత కీలకంగా మారింది. జగన్ చేయాల్సింది చాలా ఉంద‌న్న‌ది పార్టీ వర్గాలు కూడా చెబుతున్న మాట.