మాజీ ఎంపీ పిల్లి బోస్ సంచలన ఆరోపణలు.. వైసీపీ లీడర్స్ నే టార్గెట్ చేసిన ఎంపీ!
ఎంపీ బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2019 ఎన్నికల్లో ఆయనను కాదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈ స్థానం నుంచి పోటీకి పెట్టింది వైసీపీ.
By: Tupaki Political Desk | 20 Jan 2026 3:18 PM ISTవిపక్ష వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కవవుతున్నాయా? పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన ఆరోపణలకు కారణాలేంటి? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో రూ.కోటి 23 లక్షలు దోచుకున్నారని ఎంపీ బోస్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ విషయంలో పేదలకు న్యాయం చేయాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును త్వరలో కలుస్తానని ఆయన ప్రకటించారు. వైసీపీకి చెందిన సీనియర్ నేత ఇలా మీడియాలో తమ పార్టీ వారు పేదలను మోసం చేశారని, వారిపై చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాధినేతను కలవాలని నిర్ణయించుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఏ ఉద్దేశంతో ఎంపీ బోస్ ఇలాంటి ప్రకటన చేశారంటూ అంతా ఆరా తీస్తున్నారు.
ఎంపీ బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2019 ఎన్నికల్లో ఆయనను కాదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈ స్థానం నుంచి పోటీకి పెట్టింది వైసీపీ. అప్పట్లో వైసీపీ గాలి వీయడంతో వేణు భారీ మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో మండపేట నుంచి పోటీ చేసిన బోస్ ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల అనంతరం తొలుత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవిని బోస్ కు ఇచ్చారు. అయితే మండలి రద్దు చేయాలన్న మాజీ సీఎం జగన్ నిర్ణయంతో బోస్ మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ స్థానం తీసుకున్నారు. ఇక బోస్ స్థానంలో అప్పటి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యారు. 2024 వరకు వేణు మంత్రిగా కొనసాగారు. ఈ టర్మ్ లో ఎంపీ బోస్, మాజీ మంత్రి వేణు వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు.
ఇక త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎంపీ బోస్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి, వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల పేరుతో పేదల డబ్బును కైంకర్యం చేశారని ఆరోపించడం సంచలనం రేపుతోంది. మెప్మా ద్వారా పేదలు రుణాలు తీసుకుని ఆ డబ్బును నలుగురికి చెల్లించారని, ఆ నలుగురు వైసీపీ వారేనని ఎంపీ చెబుతున్నారు. రూ.1.23 లక్షలు తీసుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్లు బోస్ వెల్లడించారు.
అయితే ఇన్నాళ్లు ఈ విషయంలో సైలెంటుగా ఉన్న బోస్ ఇప్పుడు బహిరంగ ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. మరో నాలుగు నెలలో ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. ఎంపీ బోస్ ఆవేదనలో పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నా, అంతకు మించిన రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అని అనుమానిస్తున్నారు. తమ పార్టీ వారే డబ్బు వసూలు చేశారని చెబుతున్న బోస్.. అధికారంలో ఉన్నప్పుడు వారిపై ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారని ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అంటున్నారు. పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని ఇరుకన పెట్టాలనే ఉద్దేశమే బోస్ ఆరోపణల్లో కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి ఎంపీ బోస్ చేసిన ఆరోపణలు గోదావరి జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసినట్లు చెబుతున్నారు.
