Begin typing your search above and press return to search.

వైసీపీలో యూరియా అంటే తెలియని వాళ్ళకు రైతు విభాగమా ?

తాడేపల్లి లో అపాయింట్మెంట్లు తీసుకుని ఫోటోలు కి స్టిల్ ఇస్తే చాలు వారు మంచి నాయకులుగా గుర్తింపు పొందుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.

By:  Satya P   |   11 Sept 2025 10:00 PM IST
వైసీపీలో యూరియా అంటే తెలియని వాళ్ళకు రైతు విభాగమా ?
X

వైసీపీలో పదవుల పందేరం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిబద్ధత, అంకితభావం వారికి ఇచ్చే పదవుల విషయంలో అవగాహన ఇవన్నీ కూడా ఆలోచించి ఇస్తున్నారా అన్నది పార్టీలో చర్చ అయితే సాగుతోందట. వైసీపీలో ఎవరికి ఏ పదవులు ఇస్తున్నారో అధినాయకులకే తెలియడం లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. తాడేపల్లి లో అపాయింట్మెంట్లు తీసుకుని ఫోటోలు కి స్టిల్ ఇస్తే చాలు వారు మంచి నాయకులుగా గుర్తింపు పొందుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక పదవుల విషయంలో వారికే కట్టబెడుతున్నారు అని ఫ్యాన్ పార్టీలో నిర్వేదంగా ఉంది.

విపక్షంలో ఉన్న వేళ :

వైసీపీ విపక్షంలో ఉంది. ఎన్నడూ లేని విధంగా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించింది ఈ నేపధ్యంలో పార్టీని మళ్ళీ పైకి లేపి జనాలకు చేరువ చేయాలంటే బాగా కష్టపడిన వారికి గ్రౌండ్ లెవెల్ లో అను నిత్యం ఉంటూ జనంతో మమేకం అయిన వారికి ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు నాయకుడు అంటే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ తన పలుకుబడితో నాలుగు ఓట్లు తెచ్చే వారుగా ఉండాలని అంటున్నారు. అలాంటి వారికి అధినాయకత్వం ప్రోత్సాహం ఇచ్చేలా పదవులు ఇస్తే వారూ దూకుడు మీద రాజకీయం చేస్తారు, మరో వైపు పార్టీ కూడా పటిష్టం అవుతుంది అని అంటున్నారు. కానీ వైసీపీలో ఈ తరహా విధానమే లేదా అన్న చర్చ సాగుతోంది. కష్టపడే వారికి పదవులు కష్టమే అన్న భావన కూడా ఏర్పడిపోతోంది అని అంటున్నారు.

తాడేపల్లి వెళ్ళే వాళ్ళకే పదవులు :

వైసీపీ ప్రధాన కార్యాలయం అయిన తాడేపల్లికి వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చే వారికే పదవులు దక్కుతున్నాయని వైసీపీలో గుసగుసలు పోతున్నారు. తీరా చూస్తే ఈ పదవులు అందుకున్న వారికి వారి గ్రామాలలో నాలుగు ఓట్లు తెచ్చే సీన్ కూడా లేదని అంటున్నారు. జనంలో పట్టు ఉన్న వారిని గట్టిగా పనిచేసే వారికి వైసీపీలో పెద్దలు ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్వేదం చెందుతున్నారు. వైసీపీని ఎవరు గట్టెక్కిస్తారో ఎవరు నాలుగు ఓట్లు తెచ్చి పెడతారో చూసి పదవులు ఇచ్చే విధానం అయితే ఫ్యాన్ పార్టీలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

వ్యవసాయం గురించి తెలియదా :

ఇక ఇటీవల చూస్తే వైసీపీ రైతు విభాగం కింద పదవులు భర్తీ చేసింది. అయితే ఈ పదవులు అందుకున్న వారికి వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా అన్నది కూడా పార్టీలోనే ప్రశ్నగా వస్తోందట. అధినేత వద్దకు వెళ్ళి బిల్డప్ ఇస్తే చాలు పదవులు ఇస్తున్నారా అని కూడా అంటున్నారు. వైసీపీ గ్రాఫ్ పెరగాలి అంటే పార్టీ నాయకులే జనంలో ఉండాలి. వారే వారధిగా నిలిచి పనిచేయాలి. వారే ప్రభుత్వం మీద పోరాడాలి. అలాంటి వారిని ఎంపిక చేసుకుని పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఏమీ చూడకుండా పదవులు కట్టబెడితే చివరికి నష్టపోయేది పార్టీయే అని కూడా అంటున్నారు.

సర్కార్ ని నిలదీయాలంటే :

నాయకుడిలో ముందు విషయం ఉండాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే అన్ని అంశాల మీద సరైన అవగాహన ఉండాలి. అపుడే వారితో పాటు పార్టీ కూడా రాణిస్తున్నారు. అంతే తప్ప పదవులే తమకు అలంకారం అనుకునే వారికి తెచ్చి వాటిని ఇస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. కష్టించి పనిచేసే వాళ్ళను వైసీపీ పెద్దలు గుర్తించాలని కోరుతున్నారు. వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉన్న వారికి ఇస్తే ఆ కష్టాలు నష్టాలు ప్రభుత్వానికి నేరుగా నివేదిస్తారు అని అంటున్నారు. సరైన తీరులో నిలదీస్తారు అని కూడా అంటున్నారు.

సోషల్ మీడియాను వాడుకోలేకపోతున్నారా :

ఒక వైపు చూస్తే ఏపీలో యూరియా సమస్య ఉందని వైసీపీ అంటోంది. అన్న దాత అంటూ పోరు బాట పట్టింది మరి ఇంతలా ఆందోళన చేస్తున్న పార్టీ ఈ కీలకమైన అంశంలో సోషల్ మీడియాను ఎందుకు వాడుకోలేకపోయింది అని అంటున్నారు. యూరియా అంటే తెలియని వాళ్ళకు పదవులు ఇవ్వడం వల్లనే ఈ తంటా వస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఏ రకమైన సబ్జెక్ట్ లేని వారు ముందు వరసలో ఉంటే పార్టీకే అగచాట్లు వస్తాయని క్యాడర్ అంటోంది. పార్టీ గాడిలో పడాలి అంటే ముందు పనిచేసే వారిని గుర్తించాలని అంతా కోరుతున్నారట. మరి ఈ విషయంలో వైసీపీ పెద్దలు ఏ రకమైన ఆలోచనలు చేస్తారో చూడాల్సి ఉంది.