మరో నలుగురిని లాగేద్దాం: కూటమి వ్యూహం ..!
పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల విషయంలోనూ, అదే విధంగా ఎమ్మెల్సీల విషయంలోనూ వైసీపీ ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గానీ అంతర్మథనం గానీ చెందుతున్నట్టుగా సంకేతాలు కనిపించడం లేదు.
By: Garuda Media | 22 Sept 2025 12:00 PM ISTపార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల విషయంలోనూ, అదే విధంగా ఎమ్మెల్సీల విషయంలోనూ వైసీపీ ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గానీ అంతర్మథనం గానీ చెందుతున్నట్టుగా సంకేతాలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆది నుంచి వైసీపీ అనుసరిస్తున్న విధానమేనని చెబుతున్నారు. పోయేవాళ్ళు పోతారు.. ఉండే వాళ్ళు ఉంటారు.. అన్న ధోరణితోనే జగన్ ఆది నుంచి వ్యవహరిస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ వంటి బలమైన నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన.. ఆళ్ళ నాని వంటి నాయకులు పార్టీలు మారిన జగన్ ఏనాడు బయటకు వచ్చింది లేదు. వారిని బ్రతిమాలింది లేదు.
పిలిచి చర్చించింది కూడా లేదు. అంతేకాదు మరీ ముఖ్యంగా తనకు కుడి భుజంగా ఉన్న విజయసాయి రెడ్డి వంటి వారు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయినప్పుడు జగన్ స్పందించలేదు. తర్వాత చాన్నాళ్లకు ఆయన స్పందిస్తూ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన కొన్నాడు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అంతకుమించి సాయి రెడ్డిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి ఈ పరిణామాలను ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది చూడాలి.
ప్రస్తుతం మరి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో కార్యక్రమాలు సాఫీగానే నడుస్తున్నప్పటికీ శాసనమండలిలో మాత్రం వైసిపి నుంచి బలమైన పోరాటం కనిపిస్తోంది. మంత్రులకు అదే విధంగా కూటమి ప్రభుత్వానికి కూడా వైసిపి ఎమ్మెల్సీ ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో పై చేయి సాధించాలంటే మరో నలుగురిని తీసుకుంటే సరిపోతుందని అంచనా టిడిపి వర్గాల్లో ఉంది.
అయితే దీనిపై ఎవరూ బయటకు మాట్లాడక పోయినప్పటికీ.. అంతర్గత చర్చల్లో మాత్రం నలుగురు ఎమ్మెల్సీలను కనుక టిడిపి వైపు తిప్పుకోగలిగితే లేదా కూటమి పార్టీల వైపు తిప్పుకోగలిగిన ఇక వైసిపికి అటు శాసనసభలోను ఇటు మండలిలోనూ బలం తగ్గే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు.
ఈ విషయం వైసిపి నాయకుల వరకు చేరిందని కూడా సమాచారం ఉంది. అయినప్పటికీ జగన్ కానీ.. పార్టీ సీనియర్ నాయకులు కానీ ఈ విషయంపై స్పందించడం లేదు. ఎవరిపోయినా పర్వాలేదు అన్నధోరణిలోనే ఉన్నారు కాబట్టి వైసిపి విధానాలు మారుతాయా లేకపోతే నాయకులు మారాలా అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ పరిస్థితి మాత్రం ఒక ఇంత ఇబ్బందికరంగానే మారింది అన్నది వాస్తవం.
