Begin typing your search above and press return to search.

వైసీపీ షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్...దారికి వస్తారా ?

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గా తాజాగా మంతెన యోగేంద్ర కుమార్ బాబుని పార్టీ నియమించింది.

By:  Satya P   |   3 Aug 2026 9:46 AM IST
వైసీపీ షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్...దారికి వస్తారా ?
X

ఏపీలో వైసీపీ బలంగా పుంజుకోవాలని భావిస్తోంది. 2024 ఎన్నికల్లో అధికారంలో ఉండడం వల్ల ధీమా అధికం అయింది. దాంతో వై నాట్ 175 అంటూ దూకుడుగా ముందుకు పోతే వచ్చినవి అచ్చంగా 11 సీట్లు మాత్రమే అయ్యాయి. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదని వైసీపీ ఇపుడు పెద్ద ఎత్తున యాక్షన్ కి దిగిపోతోంది అని అంటున్నారు. వైసీపీ ఓటమి చెందాక ఇంచార్జిలను చాలా చోట్ల అలాగే కొనసాగించింది. అయితే రెండేళ్ళకు పైగా సమయం ఇచ్చినా ఏపీలో సగానికి సగం అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ నేతలు యాక్టివ్ కావడం లేదని పార్టీ గుర్తించింది అని అంటున్నారు. అందుకే వరసగా ఒక్కో చోట మారుస్తూ వస్తోంది. దాంతో ఈ షాక్ ట్రీట్మెంట్ చూసి మిగిలిన వారు కొడా సర్దుకోవాల్సిందే అని హెచ్చరికలను పంపుతోంది అని అంటున్నారు.

ఉండి రాజు గారికి సైతం :

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గా తాజాగా మంతెన యోగేంద్ర కుమార్ బాబుని పార్టీ నియమించింది. తొమ్మిదేళ్ళుగా పార్టీలో పనిచేస్తూ రెండు వరుస ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన : పీవీఎల్ నరసింహరాజుని పక్కన పెట్టేశారు. ఇక ఇదే జిల్లాలో మరికొన్ని మార్పులు ఉన్నాయని అంటున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా భారీ మార్పులకు వైసీపీ సిద్ధపడుతోంది అని అంటున్నారు.

హార్డ్ కోర్ నెల్లూరులో :

ఇక వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా పోయింది. దాంతో వైసీపీ ఇపుడు అక్కడ కూడా ఇంచార్జిలను మార్చాలని నిర్ణయించింది అని అంటున్నారు. గూడూరులో ఎమ్మెల్సీ మేరుగ మురళీ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన అధినాయకత్వానికి వీర విధేయుడు అని చెబుతున్నారు. అలాంటి చోట ఆయనను మార్చేసి గురవయ్యకు ఇంచార్జి పదవిని కట్టబెట్టారు. అదే విధంగా వెంకటరిగి అసెంబ్లీ సీటు మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఇక్కడ మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచి ఇంచార్జిగా కొనసాగుతున్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో వర్గ పోరు అధికంగా ఉందిట. పార్టీని ఏకత్రాటి మీద నడిపించలేకపోతున్నారు అని నేదురుమల్లి మీద విమర్శలు ఉన్నాయి. ఆయన అందుబాటులో ఉండరని కూడా అంటున్నారు. మరి ఇక్కడ కూడా మార్పు ఖాయమా అన్న చర్చ సాగుతోంది.

ఫైర్ బ్రాండ్ సీటు సైతం :

అదే విధంగా మరో కీలకమైన సీటు కోవూరు. ఇది వైసీపీలో ఫైర్ బ్రాండ్ అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది ఉంది. ఇక్కడ నుంచి అనేక సార్లు గెలిచిన ప్రసన్నకుమార్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిచారు. ఆమె ఈ సీటులో పాతుకుపోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి అయితే పెద్దగా జనంలో కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. దాంతో ఆయన మీద కూడా అధినాయకత్వం చూపు ఉందని అంటున్నారు. ఫైర్ బ్రాండ్ అయిన ఈ మాజీ ఎమ్మెల్యే సీటుని కాపాడుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో రిజల్ట్ చూపించాల్సిందే అని అంటున్నారు. ఈయన ఒక్కరే కాదు చాలా మంది వైసీపీ ఇంచార్జిలకు స్థానిక ఎన్నికలే అగ్ని పరీక్ష అని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు తీసుకుని రాలేకపోతే మాత్రం కచ్చితంగా తప్పించేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.