దిగజారిన వైసీపీ గ్రాఫ్: కార్యకర్తలకు భరోసా ఏదీ ..!
ఒకప్పుడు జిల్లాల్లో జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో వాల్యూ ఇస్తామని, వారికి ప్రాధాన్యం పెంచుతామని పార్టీ అధినేత జగన్ ప్రకటించినా.. ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
By: Garuda Media | 1 Jan 2026 10:33 PM ISTవైసీపీ గ్రాఫ్.. 2025లో భారీగా దిగజారింది. ఒకప్పుడు జిల్లాల్లో జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో వాల్యూ ఇస్తామని, వారికి ప్రాధాన్యం పెంచుతామని పార్టీ అధినేత జగన్ ప్రకటించినా.. ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. పైగా.. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు భరోసా కూడా కల్పించలేకపోతున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వారిపై పెడుతున్న కేసులు.. రహదారులపై పెరేడ్ నిర్వహిస్తున్న తీరుతో కార్యకర్తలు బెంబేలెత్తుతున్నారు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డుమీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారి తరఫున పార్టీ న్యాయవిభాగాన్ని అలెర్ట్ చేశారు. కేసులపై పోరాటం చేశారు. అవి గెలిచారా.? ఓడారా? అనేది పక్కన పెడితే.. కార్యకర్తలకు తక్షణ కాలంలో పార్టీ నుంచి భరోసా లభించింది. తద్వారా.. తర్వాత కాలంలో చంద్రబాబు వారు అండగా నిలిచారు. సహజంగా ఏ పార్టీ అయినా.. ఇదే చేస్తుంది. చేయాలి కూడా!.
కానీ.. వైసీపీ అధినేత జగన్ కార్యకర్తల విషయంలో మరోసారి లైట్ తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని కొందరు కార్యకర్తలు చేసిన పనులు వివాదంగా మారాయి. దీంతో వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలు.. పార్టీ నుంచి అంతో ఇంతో అండ కోరుకుంటారు. తప్పులు చేసింది వాస్తవమే అయినా.. పార్టీ వారికి అండగా నిలిచి.. న్యాయపోరాటం చేయాలని భావిస్తారు. కానీ, వైసీపీ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. దీంతో కార్యకర్తలు ఇప్పుడు పార్టీ తరఫున పనిచేసేందుకు జంకుతున్న పరిస్థితి ఏర్పడింది.
ఇక, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున పనిచేసేందుకు వస్తున్న వారు కూడా తగ్గుతున్నారు. అవకాశం కోసం ఒకప్పుడు సమయం చూసుకునేవారు. కానీ, కార్యకర్తలకు వైసీపీనే ఇప్పుడు అవకాశం కల్పించిందన్న టాక్‌వినిపిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ కార్యకర్తలు తమ సేఫ్‌ను చూసుకుంటున్నారు. దీంతో వారు పొరుగు పార్టీలకు అనుబంధంగా మారుతున్నారు. ఇది దీర్ఘకాలంలో వైసీపీ కి తీవ్ర ఇబ్బందికర పరిణామం తప్పదన్న సూచనలు, హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోవైసీపీ వచ్చే ఏడాది అయినా.. జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
