కొరుకుడు పడని గోదావరి...జగన్ ఏం చేయబోతున్నారు ?
ఏపీలో వైసీపీకి రాజకీయంగా కొరుకుడు పడని రీజియన్ గా గోదావరి జిల్లాలు ఉన్నాయని అంటున్నారు.
By: Satya P | 9 Oct 2026 5:07 AM ISTఏపీలో వైసీపీకి రాజకీయంగా కొరుకుడు పడని రీజియన్ గా గోదావరి జిల్లాలు ఉన్నాయని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి మొదటి నుంచి బలం తక్కువగానే ఉంది. 2014 ఎన్నికల్లో మొత్తం 34 సీట్లకు గానూ తొమ్మిదింటిని మాత్రమే గెలుచుకుంది. 2019లో అయితే వైసీపీ ప్రభంజనం బలంగా వీచింది. టీడీపీ జనసేన విడిగా పోటీ చేశాయి. దాంతో అన్ని రాజకీయ సమీకరణలు కలసి వచ్చి వైసీపీ విజయఢంకా మోగించింది. కానీ 2024 నాటికి సీన్ రివర్స్ అయింది. వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కలసి బలమైన కూటమిగా ఏర్పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోలేదు, దాంతో పాటుగా జనసేనకు గోదావరి జిల్లాలు కీలక రాజకీయ స్థావరంగా మారాయి. టీడీపీకి సైతం ఈ జిల్లాలలో పట్టు గట్టిగానే ఉంది. దాంతో వైసీపీ సింగిల్ సీటుని కూడా గెలుచుకోలేక చతికిలపడింది.
కీలక నేతలు దూరం :
ఇక ఎన్నికల తరువాత వరసబెట్టి కీలక నేతలు అంతా వైసీపీకి దూరం అయ్యారు. ఇటీవల దివంగతులు అయిన ఆళ్ళ నాని పార్టీకి మొట్ట మొదట్లోనే రాజీనామా చేశారు. ఆయన బాటలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తప్పుకున్నారు. అలాగే అనేక నియోజకవర్గాలలో సరైన నేతలు పార్టీకి లేకుండా పోయారు. ఉన్న వారు సైలెంట్ గా కాలం గడుపుతున్నారు. ఇక గోదావరి జిల్లాలలో పెద్ద దిక్కుగా పార్టీకి ఉన్న ముద్రగడ పద్మనాభం జూలైలో దివంగతులు అయ్యారు. దాంతో వైసీపీకి గోదావరి జిల్లాలలో ఎత్తిగిల్లేది ఎలా అన్నది అతి పెద్ద టాస్క్ గా మారింది.
కసరత్తులో పార్టీ :
అయితే ఏపీలో వరుసగా పలు జిల్లాలలో పార్టీ పరిస్థితులను గ్రౌండ్ లెవెల్ నుంచి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న జగన్ గోదావరి జిల్లాల మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా పలు చోట్ల పార్టీ పదవులలో మార్పులు చేస్తున్నారు. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదే క్రమంలో గోదావరిలో కూడా పార్టీలో మౌలికమైన మార్పులు చేయడానికి జగన్ సిద్ధపడుతున్నారని అంటున్నారు. క్షేత్ర స్థాయి సమాచారాన్ని రప్పించుకున్న జగన్ ఈ విషయంలో గట్టిగానే ఫోకస్ పెట్టారని అంటున్నారు. గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణల ప్రభావం అధికంగా ఉంటుంది. దాంతో ఏ మార్పు చేసినా దానికి అనుగుణంగా చేయాల్సి ఉంటోంది. ఇక జనంలో ఉంటూ గట్టిగా పనిచేసే వారు కావాలని పార్టీ అన్వేషిస్తోంది అని అంటున్నారు.
ఒడ్డుకు చేరేనా :
రాజకీయ గోదావరిని ఈదడం వైసీపీకి ఇపుడు అతి పెద్ద పరీక్ష అని చెబుతున్నారు. ఈ రోజున చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బలంగా ఉన్నాయి. పవన్ చరిష్మా పార్టీని శ్రీరామ రక్షగా ఉంది. దాంతో ఈ రెండు పార్టీలను ఢీ కొట్టే సమర్ధ నాయకత్వం కానీ వ్యూహాలు కానీ వైసీపీకి కొరవడుతున్నాయని అంటున్నారు. పార్టీ సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో క్యాడర్ కూడా డీ మోరలైజ్ అవుతోంది అని అంటున్నారు. దీంతో సీరియస్ గానే జగన్ ఈ వైపుగా చూస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ గోదావరి జిల్లాలలో ఒడ్డుకు చేరుకునే మార్గం హైకమాండ్ కనిపెడుతుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
