ఆవిర్భావ దినోత్సవం...వైసీపీ క్యాడర్ ఆశలు
ఏ పార్టీకి అయినా ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండుగ లాంటిది. ఒక మనిషికి పుట్టిన రోజు మాదిరిగా ఒక సంస్థకు కానీ ఒక పార్టీకి కానీ ఉత్తేజం కలిగించే రోజుగా ఫార్మేషన్ డేని నిర్వహిస్తారు.
By: Satya P | 17 Feb 2026 9:15 AM ISTఏ పార్టీకి అయినా ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండుగ లాంటిది. ఒక మనిషికి పుట్టిన రోజు మాదిరిగా ఒక సంస్థకు కానీ ఒక పార్టీకి కానీ ఉత్తేజం కలిగించే రోజుగా ఫార్మేషన్ డేని నిర్వహిస్తారు. ప్రతీ రాజకీయ పార్టీ ఆ విధంగానే పార్టీ పండుగలను ఏటేటా చేసుకుంటుంది. వైసీపీలో మాత్రం మొక్కుబడిగా సీనియర్ నేతలు జెండాని కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి ముగిస్తూంటారు. ఇది చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.
ఉత్సాహంగా ఊపుగా :
కానీ ఏపీలో కానీ తెలంగాణాలో కానీ ఇతర పార్టీల తీరు అలా లేదు, పైగా వైసీపీ తరువాత పుట్టిన జనసేన అయితే ప్రతీ ఏటా ఠంచనుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు జనసేన ఈ రోజుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. దాదాపుగా నెల రోజుల నుంచి సన్నాహక కార్యక్రమాలు పార్టీ సభ్యత్వ నమోదు వంటివి కూడా చేపడుతూ జనసేనలో కొత్త హుషారుని తీసుకుని వస్తున్నారు.
టీడీపీ ఒక ట్రెండ్ సెట్టర్ :
తెలుగుదేశం పార్టీ విషయాన్ని ఏ మాత్రం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పార్టీ వేడుకలను నిర్వహించడంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా ఉంటోంది. టీడీపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు బహుశా దేశంలో మరే పార్టీ కూడా నిర్వహించి ఉండదు, ఎన్ టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ అదే ఒరవడి కొనసాగుతోంది. లోకేష్ సైతం దానిని అందిపుచ్చుకున్నారు. ఇక తెలంగాణాలో బీఆర్ఎస్ కూడా ప్రతీ ఏటా ఏప్రిల్ 27న పార్టీ పండుగను నిర్వహిస్తూ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తోంది.
వైసీపీ భిన్నమైనదే :
పార్టీ వేడులకు ప్రతీ ఏటా బహిరంగ సభను నిర్వహించి చేయడం మొదటి నుంచి వైసీపీ అలవాటుగా పెట్టుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఆ రోజున పార్టీ పరంగా గుర్తు చేసుకోవడం గానే ఉంటుంది. అయితే వైసీపీ ఒక బలమైన పార్టీగా ఏపీలో ఉంది. ఆ పార్టీ పుట్టడమే ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో నుంచి అని చెప్పాలి. తండ్రి వైఎస్సార్ మరణం తరువాత జగన్ కి కాంగ్రెస్ పార్టీ తో విభేదాలు రావడం వలన జగన్ కొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న కాంగ్రెస్ పార్టీ ద్వారా తనకు సంక్రమించిన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2010 డిసెంబర్ 7న పులివెందులలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత 2011 మార్చి 12న తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్సార్ పార్టీగా ప్రకటించారు.
క్లిష్టమైన స్థితిలో :
ప్రస్తుతం వైసీపీ క్లిష్టమైన స్థితిలో ఉంది. క్యాడర్ లో కొత్త ఉత్సహాం నెలకొల్పాల్సిన తరుణం ఉంది. అందువల్ల మార్చి 12న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని క్యాడర్ అంతా కోరుకుంటున్నారు అన్ని పార్టీల మాదిరిగానే వైసీపీ కూడా బహిరంగ సభను నిర్వహించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ని పిలిపించి దిశా నిర్దేశం చేస్తే ఆ ఉత్సాహమే వేరు అని అంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం 2027 జూలైలోనే పార్టీ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు. మరి ఈసారి పార్టీ పండుగ ఏ విధంగా నిర్వహిస్తారు అన్నది ఇప్పటికి అయితే తెలియదు అనే అంటున్నారు.
