Begin typing your search above and press return to search.

జగన్ న్యూ మూవ్...కాపు నేతలకు ఫ్రీ హ్యాండ్ !

వైసీపీలో ఉన్న కాపు నేతలు ఇపుడు కీలకం అయ్యారు. 2029 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి అంటే ఏపీలో బలమైన్ కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.

By:  Satya P   |   21 Jun 2026 11:00 PM IST
జగన్ న్యూ మూవ్...కాపు నేతలకు ఫ్రీ హ్యాండ్ !
X

వైసీపీలో ఉన్న కాపు నేతలు ఇపుడు కీలకం అయ్యారు. 2029 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి అంటే ఏపీలో బలమైన్ కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను పవన్ ఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి అదే అస్త్రంతో తిప్పు కొట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఈ క్రమంలో కాపులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక సామాజిక వర్గం నేతలు అంతా ఒక చోట సమావేశం అయి తీర్మానాలు చేయడం అన్నది అరుదైన సందర్భం. ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనే జరుగుతుంది. కానీ వైసీపీ ఇపుడు కాపులకి అటువంటి అవకాశం ఇచ్చింది. కోస్తా జిల్లాలలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఏకత్రాటిపైకి తీసుకుని వచ్చే బాధ్యతను వైసీపీ కాపు నేతల మీద వైసీపీ హైకమాండ్ పెట్టింది.

తొలి సమావేశంతోనే :

ఇదిలా ఉంటే కాపుల తొలి సమావేశం గోదావరి జిల్లాలకు గుండె కాయ లాంటి కోన సీమ జిల్లా వెంకటాపురంలో జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఉన్న వైసీపీ కాపు నేతలు అంతా హాజరు కావడం విశేషం. వీరంతా ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించినట్లుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సామాజిక వర్గం స్థితిగతులు అలాగే ఏపీలో సామాజికంగా రాజకీయంగా కాపుల పరిస్థితులు చర్చించినట్లుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని దానిని హైలెట్ చేస్తూ జనంలోకి వెళ్లాలని కూడా కాపు నేతలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బొత్స కీలక వ్యాఖ్యలు :

ఇక కాపు సమావేశానికి హాజరైన ఉత్తరాంధ్రా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎవరితో అధికారంలోకి తీసుకుని రావడానికి తాము సమావేశాలు పెట్టుకోమని చెప్పడం విశేషం. అంతే కాదు తాము కాపుల కోసం వారి సమస్యల మీద చర్చించడానికే సమావేశం అయ్యామని చెప్పారు. కూటమి పార్టీలు ఎన్నికల వేళ కాపు కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాయని ఆ హామీల గురించి కూడా చర్చించామని బొత్స చెప్పారు. ఇక వైసీపీ హయాంలో కాపు నేస్తం పేరుతో తాము ఆర్ధికంగా నిధులు ఇచ్చామని బొత్స చెప్పుకొచ్చారు.

వరుస భేటీలతో :

ఇదిలా ఉండగా వెంకటాపురంలో జరిగిన సమావేశం మొదటిది అని దీని తరువాత మరిన్ని సమావేశాలు ఏపీలో పలు చోట్ల నిర్వహించాలని కాపు నేతల సమావేశం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజులలో వైసీపీలో పేరున్న నోరున్న కాపు నేతలు అంతా రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయాలని కూడా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే గోదావరి జిల్లాల నుంచే కాపుల కదలిక అన్నది మొదలైంది అని అంటున్నారు. ఇది ఏ రూపం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు చూస్తే ఇంకా మూడేళ్ళకు పైగానే ఉన్నాయి. మరి ఇప్పటి నుంచే వైసీపీ అందుకున్న ఈ సరికొత్త కాపు నినాదం ఏ రకమైన పర్యవశానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.