కార్పోరేటర్లు కౌన్సిలర్స్, సర్పంచులను జగన్ ఎందుకు కలవడం లేదు ?
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించింది. ఆ ఎన్నికల్లో నూటికి ఎనభై తొంబై శాతం వైసీపీ వారే నెగ్గారు.
By: Satya P | 18 Sept 2025 7:15 PM ISTవైసీపీ ఓటమి తరువాత వైసీపీ అధినాయకత్వం ఆ మధ్య దాకా వివిధ వర్గాల పార్టీ నేతలతో సమావేశాలు సమీక్షలు నిర్వహించింది. ఇక్కడ ఓటమి ఎందుకు జరిగింది అన్న దాని మీద చర్చించారు. అయితే ఈ సమావేశాలలో జగన్ మాట్లాడడం తప్పించి వచ్చిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ పార్టీ ఎంతవరకూ తీసుకుంది అన్నది అయితే తెలియదనే ప్రచారం సాగింది. ఇలా కొన్నాళ్ళ పాటు పార్టీ వేదికల మీద సమావేశాలు అయితే జరిగాయి కానీ అవన్నీ జగన్ దిశా నిర్దేశం చేసినవే అని గుర్తు చేస్తున్నారు. అలా కాకుండా వచ్చిన వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటే గ్రౌండ్ లెవెల్ లో జరిగేది ఏమిటి అన్నది రియాలిటీ తెలిసేది అని అంటున్నారు. ఇక చూస్తే వైసీపీ ఈ రోజుకీ ఓడినా వారు ఇంకా అధికారంలో ఉన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులే కీలకం :
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించింది. ఆ ఎన్నికల్లో నూటికి ఎనభై తొంబై శాతం వైసీపీ వారే నెగ్గారు. ఒక దశలో చూస్తే కనుక వైసీపీ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా అంతా వారే ఉండేవారు. అంత పటిష్టంగా పార్టీ కనిపించేది. అయితే 2024 ఎన్నికల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడారు. కానీ లోకల్ బాడీస్ లో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వారిలో అనేక మంది కూటమి వైపుగా వెళ్ళినా ఇంకా కనీసంగా సగానికి సగం మంది వైసీపీతోనే ఉన్నారు. వారే క్షేత్ర స్థాయిలో వైసీపీకి బలం బలగం అని చెప్పాలి. ఒక విధంగా వారే కీలకంగా కూడా చూడాల్సి ఉంది.
ఫీడ్ బ్యాక్ తోనే ముందుకు :
వైసీపీ స్థానిక ఎన్నికల్లో తమ ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున గెలిపించుకుంది. వారు మూడేళ్ళ పాటు వైసీపీ హయాంలో పనిచేశారు. ఇపుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వారు కొనసాగుతున్నారు. దాంతో వారికి ప్రజలు ఏమనుకుంటున్నారు. ప్రజా సమస్యలు ఏమిటి, వైసీపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న ఆదరణ ఏమిటి ప్రజలు ఏమి ఆశిస్తున్నవి అన్నవి బాగా తెలుస్తాయి. అందువల్ల వారితో కనుక వైసీపీ అధినేత జగన్ భేటీ అయితే పార్టీకి ఎంతో లాభం అని అంటున్నారు. వారిచ్చే ఫీడ్ బ్యాక్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
క్యాడర్ తోనే భేటీ :
పార్టీ ఎపుడైనా తన స్వరూపాన్ని పూర్తిగా చూసుకోవాలి అంటే క్యాడర్ నుంచే మొదలెట్టాలి. అలా చూస్తే కనుక క్యాడరే ముందు కనిపిస్తారు. వారు బలంగా ఉంటేనే పార్టీ బాగుంటుంది. పంచాయతీ వార్డు మెంబర్ తో మాట్లాడితే ఒక అన్నం మెతుకుని పట్టుకున్నట్లు అవుతుంది. ఆ విధంగా అక్కడ పరిస్థితి ఏమిటీ బాగా అర్థం అవుతుంది అని సూచిస్తున్నారు. పార్టీలో పై స్థాయి నేతలను కలిసి కంటే క్యాడర్ తోనే మమేకం అయి ముందుకు సాగితేనే రేపటి రోజున వైసీపీకి కొత్త దారి కనిపిస్తుంది అని అంటున్నారు.
అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది వారికే :
వైసీపీ అధినాయకత్వం నాయకులకు అపాయింట్మెంట్లు ఇచ్చి వారితో భేటీలు అయితే పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. దానికి బదులుగా పార్టీకి జెండా కర్రగా జీవనాడిగా ఉండే స్థానిక ప్రజా ప్రతినిధులను కలిస్తేనే ఉపయోగం అని చెబుతున్నారు. గ్రామాలలో పట్టణాలలో మున్సిపాలిటీల్లో ఎన్నికలు వస్తే పార్టీ తరఫున నిలబడేది ప్రత్యర్థులతో కలబడేది పార్టీ జెండా ఎగరేసేది క్యాడర్ మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు చూస్తే పార్టీ ఓటమి చెందినా అధినాయకత్వం వారితో సమావేశాలు పెట్టకపోవడంతో వారంతా బాధగా ఉన్నారని అంటున్నారు.
ప్రజా దర్బార్ వేదికగా :
వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పూర్తిగా బిజీగా ఉన్నారు. ఆనాడు పార్టీ వారిని కలవలేదు అంటే అర్థం చేసుకున్నారు. కానీ ఇపుడు విపషంలోనే ఉన్నారు కదా ఎక్కువ సమయం పార్టీ కోసం వెచ్చించవచ్చు కదా అంటున్నారు. ప్రజా దర్బార్ లాంటి వేదికను పెట్టి తాడేపల్లిలోనే ప్రతీ రోజూ కనీసం వేయి మంది దాకా కలిస్తే చాలు పార్టీకి అదే ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మా మునిసిపాలిటీలో ఇరవైకి ఇరవై మంది కౌన్సిలర్స్ వైసీపీకి కట్టుబడి ఉన్నాం, పార్టీ అసలు మారలేదు అయినా అధినాయకత్వం అపాయింట్మెంట్ మాత్రం దక్కడం లేదు కొంతమంది నాయకులు బాహాటంగానే చెబుతున్నారుట. మేము కలవాలని కోరితే పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. ఇకనైనా అధినాయకత్వం తీరు మారాలని వారు కోరుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఫైట్ చేసేది క్యాడర్ అని వారిని దగ్గరకు తీస్తేనే పార్టీకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. మరి అలా జరుగుతుందా వైసీపీ పెద్దలు ఏమి ఆలోచిస్తారో చూడాల్సి ఉంది.
