వైసీపీకి శత్రువులు ఎక్కడో లేరా ?
వైసీపీ విపక్షంలో ఉంది. అత్యంత ఘోరంగా ఓటమి పాలు అయింది. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కేంత సంఖ్యాబలం రాలేదు.
By: Satya P | 21 Sept 2025 9:30 AM ISTవైసీపీ విపక్షంలో ఉంది. అత్యంత ఘోరంగా ఓటమి పాలు అయింది. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కేంత సంఖ్యాబలం రాలేదు. అయితే ఈ విషయం సొంత నేతలకు మాత్రం అసలు అర్ధం అవడం లేదు అంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. సైలెంట్ గా చోట ఏ గొడవా లేదు, అయితే అది పార్టీని దిగజారుతోంది. అలాంటి సైలెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక వైపు ఉంటే నువ్వా నేనా అని ఢీ కొడుతూ పార్టీలో రచ్చ చేసుకునే నేతలతో వర్గ పోరుతో అగ్గి రాజుకుంటున్న అసెంబ్లీ సెగ్మెంట్లు మరికొన్ని ఉన్నాయని అంటున్నారు.
ఎమ్మిగనూర్ లో సీన్ సితార్ :
రాయలసీమలో కర్నూల్ జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. 2014, 2019లలో వైసీపీ ఇక్కడా తన సత్తా చాటింది. 2024లో మాత్రం ఫేట్ మారింది సీట్లు మొత్తం చేజారాయి. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు సీటు కూడా పోయింది. ఇక్కడ గత రెండు సార్లూ వైసీపీ గెలిచింది. ఈసారి మాత్రం ఓడింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తప్పుకోవడంతో ఆ సీటుని మాజీ ఎంపీ అయిన బుట్టా రేణుకకు ఇచ్చారు. ఆమె ఓటమి పాలు అయ్యారు. అయితే తన ఓటమికి మాజీ ఎమ్మెల్యే వర్గీయులే ఎక్కువ కారణం అని ఆమె భావిస్తూ వస్తున్నారు.
రెండు వర్గాలుగా :
ఆనాటి నుంచి రెండు వర్గాలుగా ఎమ్మిగనూరు వైసీపీ రాజకీయం మారింది అని అంటున్నారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి పదవి కోరుకుంటున్నారు. ఆయన బుట్టా రేణుక నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఏ మాత్రం సహకరించడం లేదు అని అంటున్నారు. ఇక బుట్టా రేణుక కూడా ఆయనను ఆ వర్గాన్ని పక్కన పెట్టి సొంతంగా కమిటీలు వేసి తన వారితోనే కలసి రాజకీయాలు చేస్తున్నారు దీంతో పార్టీ గొడవలు ముదిరిపోయి వైసీపీ మరింత బలహీనం అవుతోంది అని అంటున్నారు.
సయోధ్య ఒక మిధ్య :
ఇక పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన కర్నూల్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుట్టా రేణుకను జగన్ మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి చర్చలు జరిపారు అని అంటున్నారు. అంతే కాదు కలసి పనిచేయాలని సూచించారు అయితే ఆయన వల్లనే ఇదంతా అని రేణుక అంటే ఆమె వల్లే వర్గ పోరు అని జగన్ అన్నారని చెబుతున్నారు. అంతే కాదు కలసి పనిచేయడం కుదరదు అని వారి వైఖరితో తేల్చేశారు అని అంటున్నారు. ఈ పరిణామాలతో జిల్లా నాయకత్వం అయితే ఏమీ చేయలేని స్థితిలో పడిందని అంటున్నరు.
సీట్ల పెంపు ఆశలతో :
వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అందువల్ల ఇద్దరికీ అకామిడేట్ చేస్తామని కష్టాలలో పార్టీని కలసి ఒడ్డుకు చేర్చాలని అధినాయకత్వం సైతం చెబుతోంది. కానీ కొత్తగా సీట్లు పెరుగుతాయో లేదో ఉన్న సీటే కావాలని ఇద్దరూ పట్టుబట్టి కూర్చుంటున్నారు అని అంటున్నారు. దాంతో నానాటికి వర్గ పోరు అలాగే సాగుతోంది ఎవరికి వారుగా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వైసీపీ ఊసెత్తకుండా టీడీపీ తన రాజకీయం ఫుల్ జోష్ తో చేసుకుని పోతోందిట. దీనిని చూసిన వైసీపీ క్యాడర్ మాత్రం శత్రువులు ఎక్కడో ఉండరు వైసీపీకి అని నిట్టూరుస్తోందిట.
