టీడీపీ ఎమ్మెల్యే సేఫ్ జోన్ లో...వైసీపీ హెల్ప్ ?
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కూన రవికుమార్ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తొలిసారి 2014 లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు.
By: Satya P | 19 Jun 2026 3:00 PM ISTఏపీలో అధికార టీడీపీ కూటమికి విపక్ష వైసీపీకి మధ్య రాజకీయ రచ్చ ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఆ పరిస్థితి ఉందా అంటే డౌటే అంటున్నారు. నిజానికి చూస్తే కనుక సహజంగానే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉండడం జరుగుతుంది. దానిని ఒడుపుగా ఒడిసిపట్టుకుని తమ వైపునకు తిప్పుకోవడం అన్నది ప్రతిపక్షం చేయాల్సిన ముఖ్య విధి. కానీ వైసీపీ ఆ విషయంలో ఫెయిల్ అవుతోంది అని అంటున్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇదే రకమైన పరిస్థితి ఉందని కూడా అంటున్నారు.
ఆయనే మళ్లీ అంటూ :
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కూన రవికుమార్ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తొలిసారి 2014 లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. కూన ఎవరో కాదు సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి స్వయాన మేనల్లుడే. అయితే తమ్మినేని పార్టీని వీడిపోయినపుడు కూన టీడీపీని అట్టేబెట్టుకుకుని ఉన్నారు. దాంతో ఆయన ఇపుడు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. తమ్మినేని ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి వచ్చారు. 2019లో ఒకసారి గెలిచారు. 2014, 2024లలో ఓటమి చెందారు. ఇక ఏడు పదుల వయసులో పడిన తమ్మినేనిని ఇస్తే పార్లమెంట్ సీటు ఇవ్వడం లేదా ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడం అన్నది వైసీపీ పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు. దాంతో అక్కడ కొత్త నాయకత్వాన్ని వైసీపీ ప్రోత్సహించింది. చింతాడ రవికుమార్ కి వైసీపీ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది.
వర్గ పోరుతో సతమతం :
అయితే తన కుమారుడు చిరంజీవి నాగ్ కి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలన్నది తమ్మినేని ఆశగా ఉంది. దాంతో ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. కానీ వైసీపీ మాత్రం చింతాడ వైపే ఉంది. దీంతో అక్కడ తమ్మినేని వర్గం చింతాడ వర్గం అని రెండు వర్గాలు ఏర్పాటు అయిపోయాయి. ఈ రెండు వర్గాల మధ్య అసలు పడదు, వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ఒకరికి ఒకరు సహకరించుకోరు. ఒక్కటిగా ముందుకు రారు. దాంతో ఆముదాలవలసలో వైసీపీకి బలం ఉన్నా కూడా వర్గ పోరుతో వీక్ అవుతోంది అని అంటున్నారు.
కూనకు వరంగా మారి :
ఇదే ఇపుడు కూన రవికుమార్ కి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. వైసీపీలో రెండు గ్రూపులు ఎప్పటికీ కలవవు, తమ్మినేనిని ప్రోత్సహిస్తే రెండవ వర్గం పనిచేయదు అన్నది 2024 ఎన్నికల్లో తేలిపోయింది. అలాగని చింతాడ వర్గానికి ఇన్చార్జి పదవి ఇస్తే తమ్మినేని వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. ఇక కూన రవికుమార్ పట్ల నెమ్మదిగా వ్యతిరేకత అయితే జనంలో పెరుగుతోంది. రెండేళ్ల పాలన ముగిసాక ఎమ్మెల్యే పనితీరు మీద కూడా జనాలు కొంత గుర్రుగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ ఐక్యంగా నిలిచి ప్రజలను కూడగట్టుకుని కార్యక్రమాలను నిర్వహిస్తే కనుక కచ్చితంగా కూనకు అది భారీ షాక్ గా మారుతుంది అని అంటున్నారు. కానీ వైసీపీలో ఉన్న లుకలుకలే కూనకు వర ప్రసాదంగా మారుతున్నాయని అంటున్నారు. దాంతో 2029 లో కూడా ఆయన హ్యాపీగా గెలుస్తారు అని అంటున్నారు. వైసీపీలో వర్గ పోరు సాగినంత కాలం టీడీపీకి అక్కడ తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
