మేయర్ రేసులో వాసుపల్లి....జగన్ వ్యూహం ?
ఆయన 20014, 2019లలో రెండు సార్లు దక్షిణం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ విశాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నగర రాజకీయాల మీద ఆయనకు పట్టు ఉంది అని అంటారు.
By: Satya P | 6 Sept 2026 6:00 PM ISTవిశాఖ మేయర్ సీటు మీద వైసీపీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టేసింది. 2021లో గెలిచిన ఆ పార్టీ జనరల్ సీటులో బీసీ మేయర్ ని మహిళను అనూహ్యంగా తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పార్టీ బీసీలకు పెద్ద పీట వేస్తుందని అలా చెప్పుకుంది. ఇపుడు మరోసారి బీసీల వైపే వైసీపీ చూపు ఉందని అంటున్నారు. అదే విధంగా స్థానిక అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా దానిని కూడా ఎన్నికల అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ పేరు అయితే వైసీపీలో చురుకుగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన 20014, 2019లలో రెండు సార్లు దక్షిణం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ విశాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నగర రాజకీయాల మీద ఆయనకు పట్టు ఉంది అని అంటారు.
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో :
విశాఖలో వైసీపీకి ఉన్న బలమైన నేతగా వాసుపల్లి పేరు వినిపిస్తుంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు చేయడమే కాదు సొంతంగా నియోజకవర్గం సమస్యల మీద ఆయన గట్టిగా పోరాడుతారు. ప్రజలతో అను నిత్యం సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. దాంతో పాటు అంగబలం అర్ధబలం కూడా ఉండడంతో ఆయన పేరుని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి మరో మాజీ ఎమ్మెల్యే కూడా మేయర్ అభ్యర్ధిగా పోటీ చేయడానికి చూస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత తైనాల విజయకుమార్. ఆయన కార్పోరేటర్ గా ఉంటూ అనూహ్యంగా 2009లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే అయిపోయారు. ఇపుడు ఆయన చూపు మళ్ళీ కార్పోరేషన్ రాజకీయాల మీద పడింది అని అంటున్నారు. జీవీఎంసీలో పట్టు ఉందని సొంత సామాజిక వర్గం సహకారం ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మద్దతు కూడా ఆయనకు ఉందని చెప్పుకుంటున్నారు.
ఫైర్ బ్రాండ్ లీడర్ గా :
అయితే ఈ ఇద్దరిలో అధినాయకత్వం మొగ్గు వాసుపల్లి వైపే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆయన దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ అని చెబుతారు. కూటమి మీద ధీటుగా విమర్శలు చేస్తారు అని పేరు. దాంతో పాటు ఆయన కూడా పోటీ చేస్తాను అని ఇప్పటికే ప్రకటించేసారు. తమ నాయకుడు జగన్ కనుక పోటీకి సిద్ధం కావాలని కోరితే తాను మేయర్ గా బరిలో ఉంటాను అని అన్నారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి తనకు అజెండా ఉందని కూడా వాసుపల్లి అంటున్నారు.
పక్కా ప్లాన్ తోనే :
వాసుపల్లిని బరిలోకి దించాలన్నది వైసీపీ పక్కా ప్లాన్ తోనే చేస్తోంది అని అంటున్నారు. కూటమి నుంచి ఓసీకి ఇస్తే నాన్ లోకల్ కి ఇస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందని అదే జనంలో పెట్టి ప్రచారం చేయవచ్చు అన్నది కూడా వ్యూహంగా ఉంది అంటున్నారు. కూటమిలో టీడీపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఓసీల నుంచే ఎక్కువ పోటీ ఉంది. దాంతో పాటు విశాఖలో స్థిరపడిన వారు కూడా పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో వారికే కనుక టికెట్ ఇస్తే వైసీపీ వలస నేతలు అని ప్రచారం చేయడానికి రెడీగా ఉంది అని అంటున్నారు. అందుకే వైసీపీ తన చేతిలో బీసీ కార్డుతో పాటు లోకల్ కార్డు కూడా ఉంచుకుందని చెబుతున్నారు. మేయర్ ఎన్నికలు అంటే డబ్బుతో ఖర్చు కాబట్టి వాసుపల్లి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆయనకే వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.
