డిజిటల్ బుక్-కోటి సంతకాలు.. వైసీపీ సాధించిందేంటి ..!
ఏపీలో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ.. ఏదో ఒకరకంగా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 3 Dec 2025 3:00 PM ISTఏపీలో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ.. ఏదో ఒకరకంగా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ తరచుగా ఏదో ఓ కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు. అయితే.. అవి ఏమేరకు సక్సెస్ అవుతున్నాయన్నది మాత్రం పెద్దగా స్క్రూటినీ చేయడం లేదు. దీంతో పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాల విషయంలో ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఎలా ఫీలవుతు న్నారు? అనేది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
దీంతో చేపడుతున్న కార్యక్రమాలు చరిత్రలో కలుస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. తాజాగా రెండు కీలక విషయాలను తెరమీదికి వచ్చారు. 1) డిజిటల్ బుక్: పార్టీప రంగా కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి వేధింపులు ఎదురైనా.. పోలీసుల నుంచి ఎలాంటి కేసులు పెట్టినా.. వెంటనే డిజిటల్ బుక్‌లో నమోదు చేయించేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై జగన్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ, తొలి రెండు మూడురోజుల్లోనే.. పెద్ద ఎత్తున వైసీపీ హయాంలో జరిగిన అక్రమలపైనే ఫిర్యాదులు వచ్చాయి.
విడదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు తన ఇల్లు పగలగొట్టించారని.. తన కారును ధ్వంసం చేయించారని ఒకరు.. నాటి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై మరో నలుగురు ఇలా ఆధారాలతో సహా ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకున్నారు. దీంతో అసలు కంటే కొసరు ఎక్కువ కావడంతో ఈ డిజిటల్ బుక్ ప్రస్తు తం ఏమైందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనిలో ఫిర్యాదు చేసుకునే నాయకులు కూడా పెద్దగా కనిపించడం లేదు.
ఇక, మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు మూడోసారి కూడా వాయిదా పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం.. పెద్దగా సంతకాల సేకరణ జరగలేదు. వాస్తవానికి ఇది వైసీపీకి అత్యంత కీలకమైన కార్యక్రమం.
అయినప్పటికీ.. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన కారణంగానే దీనికి పెద్దగా ఊపు రాలేకపోయిందన్న చర్చ ఉంది. మొత్తంగా డిజిటల్ బుక్-కోటి సంతకాలు.. వైసీపీ సాధించిందేంటి? అనే ప్రశ్న తెరమీదికి వచ్చినప్పుడు ప్రచారం తప్ప మరొకటి లేదన్న సమాధానమే వినిపిస్తుండడం గమనార్హం.
