Begin typing your search above and press return to search.

వైసీపీ డిజిటల్ బుక్.. మాజీ మంత్రి విడదల రజినికి షాక్!

పార్టీ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసుల నమోదును అడ్డుకునే ఉద్దేశంతో వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ను ఆ పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చేందుకు వాడుకుంటున్నారు.

By:  Tupaki Political Desk   |   29 Sept 2025 3:17 PM IST
వైసీపీ డిజిటల్ బుక్.. మాజీ మంత్రి విడదల రజినికి షాక్!
X

పార్టీ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసుల నమోదును అడ్డుకునే ఉద్దేశంతో వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ను ఆ పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చేందుకు వాడుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 24న డిజిటల్ బుక్ కాన్సెప్ట్ ను ప్రకటించగా, ఆ వెంటనే వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నమోదు చేయాల్సిందిగా సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులను శిక్షిస్తానని, వారు రిటైర్ అయినా వదలనని జగన్ హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ పార్టీ కార్యకర్తలు రాస్తున్నారో లేదో కానీ, వైసీపీ అధికారంలో ఉండగా తనపై దాడి జరిగిందని చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ లో మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

ఈ నెల 24న మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగా, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తనపై 2022లో దాడి జరిగిందని, వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినీయే దీనికి కారణమని ఆరోపిస్తూ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను డిజిటల్ బుక్ పోర్టల్ లో అప్ లోడు చేశారు. విడదల రజిని మనషులు తన ఇళ్లు, కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ లో మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నమోదు అయినట్లు రశీదు కూడా తీసుకున్నాడు. మీడియా సమావేశంలో ఈ లెటర్ ను చూపుతూ, నాటి ఘటనపై మాజీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆయన డిజిటల్ బుక్ కు సమర్పించిన ఫొటోలు, ఫిర్యాదు అందినట్లు పోర్టల్ లో వచ్చిన రశీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతోపాటు దాడులు, అణచివేతలకు గురయ్యారని ఆరోపిస్తూ ఆ పార్టీ యువనేత, ప్రస్తుత హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాస్తున్నట్లు తన యువగళం పాదయాత్రలో ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ప్రకారం నాటి ప్రభుత్వంలో దురుసుగా ప్రవర్తించిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలతోపాటు కొందరు కీలక అధికారుల అరెస్టును ప్రస్తావిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అధికారంలో ఉండగా, రెడ్ బుక్ ను ఖాతరు చేయని వారు.. విపక్షంలోకి వెళ్లాక తమ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయా? ఉంటే ఏ పేజీలో ఉన్నాయి? ఎలాంటి చర్యలు ఉంటాయనే టెన్షన్ తో గడుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో రెడ్ బుక్ నుంచి కేడర్ ను కాపాడటానికి మాజీ సీఎం జగన్ తాము గుడ్ బుక్ రాస్తామని ఒకసారి, ప్రతి కార్యకర్త ఎర్ర పుస్తకం రాయాలని మరోసారి చెప్పారు. కానీ, మంత్రి లోకేశ్ దూకుడు తో జగన్ బెదిరింపులు ఏవీ పనిచేయలేదని తేలిపోయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కట్టడి చేయకపోతే వైసీపీ కేడర్ మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందనే ఆలోచనతో వైసీపీ కార్యకర్తలకు పక్కాగా భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ కు తెరతీశారు. కార్యకర్తల ఫిర్యాదులు, ఇబ్బందులు శాశ్వతంగా చెరిగిపోకుండా ఉండాలంటే ఆన్ లైన్ లో అందరికీ తెలిసేలా ఫిర్యాదులు ఉండాలని, దానివల్ల తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకోబోయే చర్యలపై ఇప్పటి నుంచి భయం ఉండాలని మాజీ సీఎం జగన్ భావించారు. అయితే వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు జగన్ తీసుకువచ్చిన డిజిటల్ బుక్ అందరికీ అందుబాటులో ఉండటంతో రివర్స్ అటాక్ మొదలైందని తాజా సంఘటన ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. 2022లో దాడి జరిగితే వైసీపీ నాయకురాలిని నిందిస్తూ తాజాగా ఫిర్యాదు చేయడంతోపాటు ఆ విషయాన్ని బహిరంగంగా ప్రచారం చేయడం వల్ల డిజిటల్ బుక్ లో ఈ విధంగా వాడుకోవచ్చని అందరికీ చాటినట్లైందని అంటున్నారు.

జగన్ తీసుకువచ్చిన డిజిటల్ బుక్ ద్వారా వైసీపీ కార్యకర్తలకు సాంత్వన చేకూరుతుందని ఆశిస్తే, రాజకీయ ప్రత్యర్థులు రివర్స్ అటాక్ ప్రారంభించడం వైసీపీ శ్రేణులకు షాకిస్తోంది. లోకేశ్ రెడ్ బుక్ అంటూ తాను మాత్రమే కార్యకర్తల ఫిర్యాదులను నమోదు చేసి బాధ్యుల పేర్లు రాసుకోగా, జగన్ పబ్లిక్ డొమైన్ లో ఉంచడంతో పార్టీపై రివర్స్ అటాక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పుడు నవతరం పార్టీ అధ్యక్షుడు చేసినట్లే.. టీడీపీ, జనసేన నుంచి గతంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఫిర్యాదులు నమోదైతే పరిస్థితి ఏంటి? పార్టీ నుంచి ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందనేది చర్చకు దారితీస్తోంది.