గతం సరే.. ప్రస్తుతం మాటేంటి పేర్ని గారు!
గతంలో ఎలా వ్యవహరిస్తే.. ప్రజలుఎలాంటి తీర్పు ఇచ్చారన్న విషయంపై తాజాగా వైసీపీ కీలక నాయకు డు, మాజీ మంత్రి పేర్ని నాని ఓ ఆన్‌లైన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
By: Garuda Media | 16 Jan 2026 9:00 PM ISTగతంలో ఎలా వ్యవహరిస్తే.. ప్రజలుఎలాంటి తీర్పు ఇచ్చారన్న విషయంపై తాజాగా వైసీపీ కీలక నాయకు డు, మాజీ మంత్రి పేర్ని నాని ఓ ఆన్‌లైన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కార్యకర్తలకు, నాయకులకు మధ్య కనెక్షన్ కట్ అయిందన్నారు. అదేసమయంలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయాని కి, నాయకులకు కూడా సరైన సంబంధాలు లేకుండా పోయాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు కూడా నాయకులు దూరమయ్యారన్నారు.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని నాని చెప్పారు. గత పరిస్థితుల ను అధ్యయనం చేసి.. వాటిలో తప్పులు సరిచేసుకుంటామని చెప్పారు. ఇది మంచిదే కావొచ్చు. కానీ, వైసీపీని కీలకమైన మూడుఅంశాలు వెంటాడుతున్నాయి. ముందు వాటిని సరి చేసుకుంటే.. ప్రస్తుతం పార్టీ ఒక దారిలోకి వస్తుందన్న సూచనలను మాత్రం పేర్ని ప్రస్తావించలేక పోవడం గమనార్హం. భవిష్యత్తు అంటే.. వర్తమానం నుంచే ప్రారంభం అవుతుంది.
దీనిని విస్మరించి.. భవిష్యత్తుకు మార్గాలు ఎవరూ వేయలేరు. ఈ క్రమంలో చూస్తే.. ముఖ్యంగా రాజధాని విషయంలో వైసీపీ స్టాండేంటన్నది ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. దీనిని ప్రస్తావించకుండా.. ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనాలు కష్టమేనని చెబుతున్నారు. ఇక, పార్టీ నాయకుల విషయంలోనూ ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. అనేక మంది నాయకులు ఇప్పటికీ సుప్తచేతనావస్థలో ఉన్నారు. వారిని సరైన మార్గంలో నడిపించేందుకు పార్టీ అధినేత ఇప్పటికీ ప్రయత్నించడం లేదు.
ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక, `రప్పా-రప్పా.. పార్టీ` అనే ముద్ర బలంగా పడుతున్న నేపథ్యంలో దానిని చెరుపుకొనే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ, అలా చేయడం లేదు. పైగా రప్పా-రప్పా బ్యాచ్‌ను పెంచిపోషిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏ పార్టీ కూడా ఇలా ఒక వివాదాస్పద తరహా విధానాన్ని అందిపుచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ. వైసీపీ ఈ రప్పా-రప్పా విధానాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ముందు ఈసమస్యలు ప్రస్తావించి.. వాటిని పరిష్కరించుకునే దిశగా వైసీపీ అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.
