వైసీపీ సీపీఐ చెట్టాపట్టాల్...అనంతలో బిగ్ ట్విస్ట్
వైసీపీకి ఏపీలో మొత్తం 13 మేయర్ సీట్లలో ఎక్కడైనా ఒక్కటి దక్కుతుందా అన్నది అయితే చర్చగా ఉంది.
By: Satya P | 31 Oct 2026 6:00 AM ISTవైసీపీకి ఏపీలో మొత్తం 13 మేయర్ సీట్లలో ఎక్కడైనా ఒక్కటి దక్కుతుందా అన్నది అయితే చర్చగా ఉంది. ఎందుకంటే అధికార కూటమి బలంగా ఉంది. మూడు పార్టీలతో దూకుడు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీకి మాత్రమే వైసీపీ పరిమితం అవుతుందని విశ్లేషణలు ఉన్న వేళ ఆ పార్టీలో అనంతమైన ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు. అనంతపురం కార్పొరేషన్ మేయర్ సీటు విషయంలో వైసీపీ గట్టిగానే పోరాడుతోంది. దాంతో కొత్త మిత్రుడు కూడా ఆ పార్టీకి దొరికారు. సీపీఐ ఇక్కడ వైసీపీకి ఫుల్ సపోర్టు అంటోంది. దాంతో గెలుపు తమదేనని ఫ్యాన్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
బీజేపీతో పోటీ :
అనంతపురం మేయర్ సీటు పొత్తులలో భాగంగా బీజేపీకి కేటాయించారు. నిజానికి రాయలసీమలో బీజేపీకి పెద్దగా బలం లేదు, టీడీపీ సహకారం ఉంటేనే గెలుపు దక్కుతుంది. అయితే ఈ మేయర్ పీఠం మీద టీడీపీ చాలా ఆశలే పెట్టుకుంది. తమకు దక్కకపోవడంతో కూటమిలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఓటు బదిలీ అన్నది ఇక్కడ ప్రధానం. అనంతపురం మేయర్ పీఠం మీద బీజేపీని కూర్చోబెట్టేందుకు టీడీపీ ఏ మేరకు సహకరిస్తుంది అన్నదే చూడాలని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో వేరేగా :
ఇక్కడ చూస్తే గ్రౌండ్ లెవెల్ లో కూటమి ఐక్యత మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు. కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన కోట్ల రాజేష్ బాబు బరిలో నిలిచారు. దాంతో మేయర్ సీటును ఆశించిన కొందరు స్థానిక టీడీపీ నేతలలో తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇక అనంతపురంలో స్థానిక శాసనసభ్యుడి వర్గానికి పార్టీలోని ఇతర ముఖ్య నేతలకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఇపుడు మరో చర్చకు తావిస్తున్నాయి. కూటమిలోని తమ్ముళ్లు తమ సొంత ఓటు బ్యాంకును ఏ మేరకు బీజేపీ అభ్యర్థికి బదిలీ చేయగలుగుతారు అన్నది చూడాలని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ఏ మేరకు కలిసికట్టుగా పని చేస్తుందనే దానిపైనే బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వామపక్షాల తోడు :
బీజేపీ అంటే సిద్ధాంతపరంగా విభేదించే వామపక్షాలు సహజంగానే అక్కడ బీజేపీని గెలవనీయకూడదని పంతంగా ఉన్నాయి. దాంతో సీపీఐ వైసీపీకి మద్దతు ప్రకటించింది. అనంతపురం జిల్లాలో సీపీఐకి పట్టు ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్మిక వ్యవసాయ రంగ సమస్యలపై సీపీఐకి సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. బలమైన క్యాడర్ ఉంది. ముఖ్యంగా గుంతకల్లు, ధర్మవరం వంటి ప్రాంతాలలో ఈ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అనంతపురంలోనూ బలం ఉంది.
రాజకీయ ప్రభావం :
ఇక వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ఇటీవల సీపీఐ నాయకులను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ, సీపీఐ అభ్యర్థుల విజయానికి ఇరు పార్టీల నాయకులు ఉమ్మడిగా కృషి చేస్తున్నారు. ధర్మవరం వంటి ప్రాంతాల్లోనూ సీపీఐ, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రెండు పార్టీల కలయిక అనంతపురం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీపీఐ నాయకులు అయితే అనంతపురం మేయర్ సీట్లో బీజేపీ ఓటమితో ఢిల్లీ పాలకులకు గుణపాఠం కావాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ సీపీఐ కలయిక ఈ ఎన్నికల్లో కొత్త పరిణామంగానే చూస్తున్నారు.
