Begin typing your search above and press return to search.

జగన్ పీకే చేతులు కలపబోతున్నారా ?

ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఏపీ పాలిటిక్స్ అంటేనే ఎపుడూ సంచలనంగానే ఉంటుంది.

By:  Satya P   |   22 March 2026 9:00 AM IST
జగన్ పీకే చేతులు కలపబోతున్నారా ?
X

ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఏపీ పాలిటిక్స్ అంటేనే ఎపుడూ సంచలనంగానే ఉంటుంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆ కాక అలా మండుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి విపక్ష హోదా సైతం అందుకోలేనంతగా వైసీపీ చతికిలపడిపోయింది. ఇక వైసీపీ ఓటమి మూటకట్టుకుని రెండేళ్ళకు దగ్గర కావస్తోంది. ఎన్నికలు మరో మూడేళ్ళలో ఉన్నాయి. అయితే వైసీపీని పునర్ నిర్మించుకోవాల్సి ఉంది. అలాగే జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పాదయాత్రకు తగిన యాక్షన్ ప్లాన్ ని రూపొందించాల్సి ఉంది. ఆ మీదట జనంలోకి వెళ్ళేటప్పుడు వారి మనసులలోకి చొచ్చుకుని పోయే స్లోగన్స్ అవసరం. జనాల అవసరాలను చూడాలి కొత్త హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏమి చేసింది ఏమి చేయలేదు అన్నది చూసుకుంటూ వైసీపీ సరికొత్త రకమైన ఆల్టర్నేటివ్ పొలిటికల్ లాజిక్ తో ముందుకు సాగాల్సి ఉంటుంది.

వ్యూహకర్తల కోసం :

ఇక వైసీపీ 2019 ఎన్నికల ముందు రెండేళ్ళకు అంటే 2017లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ని తీసుని వచ్చింది. పీకే అయితే నవరత్నాలు వంటివి రూపొందించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేయడమే కాకుండా ఆ పార్టీ బలాలను బలహీనతలను గుర్తించి మరీ వైసీపీని అప్రమత్తం చేశారు. ఇక టీడీపీ నాడు ఆశ్రిత పక్షపాతంగా మారింది అని కూడా పీకే తన వ్యూహాలతో వైసీపీకి ఆయుధాలు అందించి జనంలో పలుచన చేయించారు. మొత్తానికి అన్నీ ఫలించి వైసీపీ 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. అయితే 2024 నాటికి వైసీపీ పీకేని దూరం పెట్టి ఐ ప్యాక్ టీం తో ముందుకు సాగింగి. ఆ విధంగా అనూహ్యమైన పరాజయం పాలు అయింది. ఐ ప్యాక్ టీం వైసీపీని దెబ్బ తీసింది అన్న ఆగ్రహం అయితే పార్టీలో ఉంది. దీంతో 2029 ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి కొత్త ఎన్నికల వ్యూహకర్తల అవసరాన్ని గుర్తించి వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా అన్వేషణ చేస్తోంది అని ప్రచారం సాగుతోంది.

పీకే మీదనే మొగ్గు :

ఇక దేశంలో వ్యూహకర్తలు చాలా మంది ఉన్నారు. అయితే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ మీదనే వైసీపీ ఎక్కువగా మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి భారీ సక్సెస్ ని ఇచ్చిన సెంటిమెంట్ ఉంది. దాంతో మరోసారి ఆయనతోనే కలసి ముందుకు సాగితే 2029 లో మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ అధినాయకత్వం ఊహిస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పీకే 2024 ఎన్నికల ముందు టీడీపీకి కొన్ని రకలైన వ్యూహాలను అందించడమే కాకుండా సలహా సంప్రదింపులు చేశారు అని కూడా ఉంది. అయితే ఆయన బీహార్ లో పార్టీ పెట్టి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే పీకే పార్టీ అధినేతగా ఓటమి పాలు కావచ్చు కానీ వ్యూహకర్తగా సక్సెస్ అని వైసీపీ నమ్ముతోంది అంటున్నారు.

అన్నీ కుదిరితే :

ఇక వైసీపీ ఈ విషయంలో ఇప్పటికే పీకేతో సంప్రదింపులు మొదలెట్టిందని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల కోసం తొందరలోనే పీకే జగన్ చేతులు కలపవచ్చు అని అంటునారు. వైసీపీ భారీ ఎత్తున ప్లీనరీ సమావేశం నిర్వహించాలని చూస్తోంది. అది ఈ ఏడాది నా లేక వచ్చే ఏడాదినా అన్నది తెలియదు. ఎపుడు ప్లీనరీ నిర్వహించినా అందులోనే పీకే గురించి పార్టీ జనాలకు పరిచయం చేయాలని అధినాయకత్వం భావిస్తోంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఏ మేరకు ఉందో.