కొడాలి, వంశీకి జగన్ క్లాస్.. మొత్తం 20 మందికి వైసీపీ అధినేత కర్తవ్యబోధ
తాడేపల్లిలోని తన నివాసానికి అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను జగన్ పిలిపించినట్లు సమాచారం.
By: Tupaki Political Desk | 20 Nov 2025 5:20 PM ISTపార్టీ బలోపేతంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫోకస్ పెట్టారు. ఏడాదిన్నరగా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు తాజాగా జగన్ క్లాస్ పీకినట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపైనా మాజీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలుగా ఉండగా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన నేతలు అధికారం పోగానే తమది బాధ్యత లేదన్నట్లు వ్యవహరించడం సరికాదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తాడేపల్లిలోని తన నివాసానికి అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను జగన్ పిలిపించినట్లు సమాచారం. ఏడాదిన్నరగా నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో తనకు చెప్పాలని జగన్ నిలదీయగా, పలువురు నేతలు బిక్కముఖం వేశారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంశీ ఏడాదిన్నరగా నియోజకవర్గ వ్యవహారాలపై సరిగా దృష్టి పెట్టలేదని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వానికి భయపడి నియోజకవర్గాలకు దూరంగా ఉంటామంటే కొత్తవారిని చూసుకుంటానని కొందరు నేతల ముఖంపైనే జగన్ చెప్పేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని తన నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యవహారాలను చక్కదిద్దాల్సిందిపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కొన్నాళ్లు అనారోగ్యం కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కాస్త మెరుగుపడినందున యాక్టివ్ అవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. ఇదే అంశాన్ని వల్లభనేని వంశీకి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని మాజీసీఎం జగన్ సూచించారని అంటున్నారు. అదేవిధంగా అద్దంకి ఇన్చార్జి అశోక్ కమార్, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ విషయంలోనూ జగన్ ఏమాత్రం సంతృప్తిగా లేరని చెబుతున్నారు. ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాల్లో ఉండటం లేదని అధినేతకు ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తల పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నందున మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని అధినేత సూచించినట్లు సమాచారం.
