ఎన్నో మెట్లపై కూటమి ..!
వైసీపీ వేసుకున్న లెక్కలు చూస్తే.. 1) పార్టీల మధ్య విభేదాలు: సాధారణంగా కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి.
By: Garuda Media | 16 Aug 2025 8:00 PM IST''వైసీపీ చాలా కష్టపడాలి.'' ''కూటమిని చేరుకునేందుకే కాదు.. దాటుకుని ముందుకు సాగేందుకు కూడా ఎంతో శ్రమించాలి''- ఇది ఎవరో ప్రత్యర్థులు చెప్పిన మాట కాదు. అనేక మంది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనికి కారణం.. వైసీపీ ఆశించినట్టుగా కూటమి వ్యవహరించకపోవడమే. మొత్తంగా 3 ప్రధాన కారణా లతో వైసీపీ.. కూటమివిఫలమవుతుందని భావించింది. తొలి ఏడాదిలోనే ముసలం పుడుతుందని కూడా అంచనా వేసుకుంది. కానీ.. అది సాకారం కాలేదు. పైగా.. రోజు రోజుకు కూటమి హవా పెరుగుతోంది.
వైసీపీ వేసుకున్న లెక్కలు చూస్తే.. 1) పార్టీల మధ్య విభేదాలు: సాధారణంగా కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి. వస్తాయి కూడా. ఇదే వైసీపీ అంచనా. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతుందని.. దీంతో కూటమి విచ్ఛిన్నమవుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఏడాదిన్నర తర్వాత కూడా.. అదే బిగువు, అదే పట్టుదలతో కూటమి ప్రభుత్వంలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేనలు.. కలివిడిగా ఉంటున్నాయి.
2) పథకాల అమలు: సూపర్ సిక్స్ హామీలు గుప్పించి.. ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చారంటూ .. కూటమిపై వైసీపీ నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ కూడా.. పలు సందర్భాల్లో చంద్రబాబు ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. కానీ, పట్టుదలతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం.. వాటిని సాకారం చేసేదిశగా అడుగులు వేసింది. మొత్తం ఆరు హామీల్లో నాలుగు అమలవుతున్నాయి. మిగిలిన రెండు కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో వైసీపీ భావించినట్టు జరగడం లేదు.
3) తమపై సింపతీ: వైసీపీకి సింపతీ పెరుగుతుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. ఇది సహజంగానే జరు గుతుంది. కానీ, దీనిని ముందుగానే పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా.. వైసీపీని మరింత దిగజార్చే వ్యూహంతో ముందుకు సాగుతోంది. దీనికి సరైన విధంగా కౌంటర్ ఇచ్చే పరిస్థి తిలో వైసీపీ నేతలు.. కానీ, ఆ పార్టీ కానీ లేకపోవడం గమనార్హం. దీంతో వైసీపీకి సింపతీ పెరగకపోగా.. మరింత దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. కూటమి ఎన్నో మెట్లు పైకెక్కేసిందని.. దీనిని చేరుకునేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
