సీబీఐ...వైసీపీ ఈ డిమాండ్ ఎందుకు చేస్తోంది ?
సీబీఐ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. అన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా క్లిష్టమైన కేసులు ఏమైనా ఉంటే వాటిని సీబీఐకి అప్పగించాలని అంటారు.
By: Satya P | 23 Aug 2026 12:10 AM ISTసీబీఐ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. అన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా క్లిష్టమైన కేసులు ఏమైనా ఉంటే వాటిని సీబీఐకి అప్పగించాలని అంటారు. సీబీఐ తానుగా ఏ కేసునూ టేకప్ చేయదు. సీబీఐ విచారణను కేంద్ర హోం శాఖ ఆదేశించవచ్చు, అలాగే కోర్టులు ఆదేశించవచ్చు. కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరవచ్చు. ఇక సీబీఐ అంటే ప్రతిపక్షం ఎపుడూ ఎందుకో అంతగా కోరుకోదు, పైగా దానిని విమర్శిస్తూ ఉంటుంది. కానీ ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం గత కొన్నాళ్ళుగా సీబీఐ విచారణ అంటోంది. ఈ విచారణకు డిమాండ్ చేస్తోంది. నిజానికి కేంద్ర హోంశాఖ పరిధిలో సీబీఐ పనిచేస్తుంది అన్నది తెలిసిందే. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. మరి అలాంటపుడు వైసీపీ ఎందుకు ఈ విధమైన డిమాండ్ చేస్తోంది అన్నదే పెద్ద చర్చగా ఉందిపుడు.
ఉచ్చులోకి లాగాలనేనా :
ఇక చూస్తే కొన్నాళ్ళుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పొలిటికల్ వార్ జరుగుతోంది. అది కూడా డీఎస్సీ పోస్టుల మీదనే. ఈ పోస్టులలో స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా చాలా మంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేశారు అన్నది వైసీపీ వాదన. ఇది కేవలం వాదన మాత్రమే కాదు, కచ్చితమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే తమ ప్రశ్నలలో ఏ ఒక్క దానికి అయినా జవాబు చెప్పే దమ్ము ఉందా మీకు అని కూడా వైసీపీ నిలదీస్తోంది. ఇక మెగా డీఎస్సీ మీద వైసీపీ మాట్లాడుతూంటే టీడీపీ గ్రూప్ వన్ పరీక్షలలో అవకతవకలు మీద టీడీపీ ఎదురు దాడి చేస్తోంది. అది కూడా అసెంబ్లీలో చంద్రబాబు దీని మీద సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. గ్రూప్ వన్ లో వైసీపీ అవకతవకలు చేసింది అని కూడా ఆయన ఆరోపించారు.
వైసీపీ భారీ సవాల్ :
అయితే ఇదే విషయం మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు అంతా గ్రూప్ వన్ లో తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించింది అని చెబుతున్నారు. మెగా డీఎస్సీ మీద తాము ప్రస్తావిస్తూంటే గ్రూప్ వన్ అని ఎదురుదాడి చేస్తున్నారు అని కూడా మండిపడుతున్నారు. అవసరం అయితే మెగా డీఎస్సీతో పాటే గ్రూప్ వన్ పరీక్షలలో జరిగిన అవతకవల మీద కూడా సీబీఐ తో విచారణ జరిపించాలని కూడా వైసీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. గ్రూప్ వన్ పై విచారణకు తాము సీబీఐ విచారణకు రెడీ డీఎస్సీ మీద సీబీఐ విచారణకు మీరు సిద్ధమా అని వైసీపీ చంద్రబాబుని మంత్రి నారా లోకేష్ ని చాలెంజ్ చేస్తూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఒక విధంగా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తోంది అన్న మాట.
ఎవరి వాదన కరెక్ట్ అంటే :
మెగా డీఎస్సీలో ప్రభుత్వం అంతా నిబంధనల ప్రకారమే చేసింది అని టీడీపీ అంటోంది. గ్రూప్ వన్ పరీక్షలలో తాము అంతా పద్ధతి ప్రకారమే చేశామని వైసీపీ చెబుతోంది. మరి ఇందులో ఎవరి వాదన కరెక్ట్ అన్నదే తెలియడం లేదని అంటున్నారు. కేంద్రం పెట్టిన నిబంధనలు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు భర్తీ చేశామని టీడీపీ చెబుతోంది. నకిలీ సర్టిఫికేట్లతో పోస్టులు అన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టి పారేస్తోంది. . అయినా సరే సీబీఐ విచారణ అని వైసీపీ అంటోంది. అంతా కరెక్ట్ అయితే భయమెందుకు అని వైసీపీ రెట్టిస్తోంది. ఇక్కడ ఒక విషయం ఉంది.నిజానికి సీబీఐ వేసినా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉంది. వైసీపీ అన్నట్లుగా అక్కడ ఏమి విచారణలో బయటపడుతుంది అన్నది ఒక చర్చ. కానీ ముందు సీబీఐ దాకా విషయాన్ని తీసుకుని వస్తే రాజకీయంగా తాము విజయం సాధించినట్లే అన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ సీబీఐ మీద మోజు పడడం మాత్రం ఆసక్తిని రేపుతోంది.
