పాత స్లొగన్స్ కి వైసీపీ బై బై ?
నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు కూడా వారికి కేటాయించినా నిజమైన అధికారం రెడ్ల వద్దనే ఉందని నాడు అంతా చెప్పుకున్నారు.
By: Satya P | 31 Dec 2025 1:00 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ అర్థం అయిపోతుంది. ఆయన రాజకీయ సభలలో ఏమి మాట్లాడుతారు అన్నది అంతా ముందుగానే సులువుగా ఊహించ గలుగుతారు. ఎందుకంటే ఆయన పడికట్టు పదాలు అన్నట్లుగా కొన్ని వర్గాల విషయంలో అమిత ప్రేమాభిమానాలు చూపిస్తూ ప్రసంగాలు చేసేవారు. దాని ఫలితంగా వారిని సొంతం చేసుకుందామని ఆయన రాజకీయంగా వ్యూహ రచన చేశారు కానీ అవేమీ వర్కౌట్ కాలేదని 2024 ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. దాంతో పాటుగా కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడం వైసీపీకి దిమ్మ దిరిగే ఫలితంగా మారింది.
రెండింటికీ చెడి అన్నట్లు :
నా ఎస్సీలు నా ఎస్టీలు, నా బీసీలు నా మైనారిటీలు అంటూ సీఎం గా ఉండగా అయిదేళ్ళ కాలంలో వైఎస్ జగన్ తెగ ఊదరగొట్టారు. దాంతో ప్రతీ సభలోనూ వారి గురించే ఎక్కువగా ప్రస్తావన ఉండేది. అలా సామాజికపరంగా కొత్త సమీకరణలకు తెర తీసి బలమైన పటిష్టమైన ఓటు బ్యాంక్ ని వైసీపీని బిల్డప్ చేదామని జగన్ చేసిన ప్రయత్నం అయితే పూర్తిగా వికటించింది. ఇక బీసీలతో సహా ఈ వర్గాలకు వైసీపీ పెద్ద ఎత్తున పదవులు ఇచ్చింది, మంత్రి పదవులు వారికే ఎక్కువగా ఇచ్చామని కీలక శాఖలు కూడా కేటాయించామని చెప్పినా ఆచరణలో మాత్రం అసలు ఫలితాలను వారు అందుకోలేకపోయారు అని కూడా ఒక కఠిన విశ్లేషణ ప్రచారంలో ఉంది.
వారిదే ఆధిపత్యంగా :
నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు కూడా వారికి కేటాయించినా నిజమైన అధికారం రెడ్ల వద్దనే ఉందని నాడు అంతా చెప్పుకున్నారు. అలా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఈ కీలక పదవులలో ఉన్న వారు మిగిలిపోయారు ఆ ఆవేదన నిర్వేదం 2024 ఎన్నికల్లో వారి ఓటు వైసీపీ వైపు రాకుండా ఆగిందని అంటున్నారు. మరి రెడ్లకు పరోక్ష అధికారం ఇచ్చినా వారు కూడా తమకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని మౌనం వహించారు అని చెప్పుకున్నారు. ఇలా చూస్తే మొత్తంగా రెంటికి చెడిన రేవడిగా వైసీపీ మారాల్సి వచ్చింది అన్నది ఎండ్ ఆఫ్ ది డే తెలిసి వచ్చింది అని అంటున్నారు.
వీరంతా దూరం :
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అణగారిన వర్గాల వైపు చూస్తుంది. పధకాలు వారికే ఎక్కువగా ఇస్తుంది. అయితే అదే పనిగా చెప్పుకోవడం వల్ల సమాజంలోని మిగిలిన వర్గాలకు అది కంటగింపుగా మారుతుంది. వైసీపీ విషయంలో అదే జరిగింది అని అంటున్నారు. అగ్ర వర్ణాలు తమకు అవకాశాలు రాని రాజకీయంగా పలుకుబడి కలిగిన ఇతర వర్గాలు అన్నీ కూడా వైసీపీకి దూరం అయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం చేజేతులా చేసుకున్నదే అని కూడా అంటున్నారు.
చేరువ కోసం :
ఇపుడు విశ్వాసం కోల్పోయిన వర్గాలను చేరువ చేసే ప్రయత్నాలు చేయాలని పార్టీలో గట్టిగా వినిపిస్తున్న మాట. అదే సమయంలో ఏపీలో కులాల సమాహారం ఉందని అందరికీ తెలుసు. కానీ మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకున్న చందంగా ఒక రాజకీయ పార్టీ మీద ఫలానా అని ముద్ర పడడం కూడా మంచిది కాదని అంటున్నారు. వైసీపీ ఈ తప్పులను అయితే బాగా తెలుసుకుందని అంటున్నారు. మరి రానున్న రోజులలో జగన్ నోటి వెంట పాత స్లోగన్స్ వినిపిస్తాయా లేదా అన్నదే చర్చగా ఉంది. కొత్తగా ఆలోచించాలని పాత తప్పులు చేయరాదని పార్టీలో అయితే అంతా కోరుకుంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంది.
