కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి !
కానీ ఒకవేళ అనుకోనిది జరిగితే మాత్రం తాము జీవిత పర్యంతం కేసులతోనే తిరగాల్సి ఉంటుందని కూడా వాపోతున్న వారూ ఉన్నారు.
By: Satya P | 24 Sept 2026 5:00 PM ISTవైసీపీ అధినాయకత్వం దూకుడు చేయమంటోంది. కూటమి ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయమంటోంది. దాంతో వైసీపీ నాయకులు క్యాడర్ అదే తీరున గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ఫలితం వరసబెట్టి కేసులు చుట్టుకుంటున్నాయి. ఇందులో ఏకంగా నాన్ బెయిల్ బుల్ కేసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేసేలా కేసులు పెడుతూ కూటమి సర్కార్ తన పవర్ చూపిస్తోంది. ఈ పరిణామాలతో ఫ్యాన్ పార్టీలో తీవ్ర స్థాయిలో అంతర్మధనం కనిపిస్తోంది. నిరసనలు చేస్తుంటే కేసులు పడుతున్నాయి, ఇక సెక్షన్లు కూడా గట్టిగా పెడుతున్నారు, దాంతో ఒకటికి మించి వచ్చి పడుతున్న కేసులతో తట్టుకునేది ఎలా అన్న సందేహాలు కలవరాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి రోజులు వస్తాయి వచ్చేది మన ప్రభుత్వమే అని వైసీపీ హైకమాండ్ ధీమాగా చెబుతోంది. కానీ ఒకవేళ అనుకోనిది జరిగితే మాత్రం తాము జీవిత పర్యంతం కేసులతోనే తిరగాల్సి ఉంటుందని కూడా వాపోతున్న వారూ ఉన్నారు.
యాభై మంది పైన :
ఇక తాజాగా విజయవాడలోని శాప్ ఆఫీసు వద్దకు నిరసనగా వెళ్ళిన వైసీపీ నేతలలో యాభై మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించడం తీవ్ర కలవరం రేపుతోంది.శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అక్కడ జరిగిన దాడికి సంబంధించి పోలీసులు వైసీపీ నేతలపై హత్యాయత్నం అలాగే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతే కాదు వైసీపీ నేతలు అయిన దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం సహా మొత్తం 51 మంది వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను పోలీసు ఉన్నత స్థాయి అధికారులు ఆదేశించారు. అంతే కాకుండా గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న వారిపై కూడా ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని పోలీసులు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
నేర చరిత్ర ఉందంటూ :
ఇలా ఎందుకు అంటే శాప్ ఆఫీస్ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనల పేరిట వచ్చిన వారిలో పాత నేర చరిత్ర కలిగిన వారు అలాగే రౌడీ షీటర్లు ఉన్నారని సీసీటీవీ డ్రోన్ విజువల్స్ ఆధారంగా గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే దీని మీద వైసీపీ నేతలు వాదన వేరే విధంగా ఉంది. డీఎస్సీ నియామకాలపై తాము చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని ఉద్యమాన్ని అణగదొక్కడానికే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పాత కేసులను తెరపైకి తెచ్చి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ శ్రేణులపైనే టీడీపీ వారే దాడులు చేశారని వారు వాదిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మీద ఆందోళన వరకూ ఓకే కానీ ప్రతీ సారీ కేసులు పెట్టించుకోవడం అవి కూడా పెద్ద సెక్షన్లతో నమోదు కావడం పట్ల చాలా మంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నెమ్మదిగా తాము కేసుల వలలో చిక్కుకుని పోతున్నామని కూడా అంటున్నారు.
వ్యూహం అవసరం :
ఇదిలా ఉంటే వైసీపీ నేతలు కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలో వ్యూహం కూడా ఒక భాగంగా ఉండాలని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆకు మీద ముల్లు పడినా ఆకుకే ముప్పు అన్న తీరున తాము సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రెచ్చగొట్టడం రెచ్చిపోవడం వంటివి దూకుడు రాజకీయానికి బాగానే ఉంటాయి కానీ తీరా కేసులు పడడంతోనే అసలు విషయం బోధపడుతుందని అంటున్నారు. ఢీ అంటే ఢీ అన్న రాజకీయ వాతావరణం ఏపీలో ఉన్న వేళ వ్యూహాలే ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటున్నారు. దానిని వదిలేసి చేసే పోరాటాలు నేల విడిచి చేసిన సాముగా ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద ఎన్ని కేసులు పెట్టినా కళ్ళు మూసుకుంటే రెండేళ్ళలో మన ప్రభుత్వం వస్తుందని అధినాయకత్వం చెబుతున్న ముచ్చట్లు ఈ సమయంలో ఏ మేరకు క్యాడర్ కి ఊరటను ఇస్తాయో కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
