మండలిలో చర్చ లేదు...అసెంబ్లీ తీర్మానం ఓకేనా ?
ఏపీలో ఏమి జరిగినా భిన్న ధృవాల్లాంటి పార్టీలు ఉండడం వల్ల ఏ విధంగానూ పొసగడం లేదు, దేశంలో చాలా సభలలో ఉన్న సంప్రదాయాలు ఇక్కడ కనీసంగా ఉండడం లేదు, నిట్టనిలువుగా రాజకీయం చీలిపోయింది.
By: Satya P | 29 March 2026 5:00 AM ISTఏపీలో ఏమి జరిగినా భిన్న ధృవాల్లాంటి పార్టీలు ఉండడం వల్ల ఏ విధంగానూ పొసగడం లేదు, దేశంలో చాలా సభలలో ఉన్న సంప్రదాయాలు ఇక్కడ కనీసంగా ఉండడం లేదు, నిట్టనిలువుగా రాజకీయం చీలిపోయింది. గత పుష్కర కాలంగా అదే కొనసాగుతోంది. రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉంటారు, కానీ ఏపీ పాలిటిక్స్ లో మాత్రం శత్రువులుగా ఉంటున్నారు అని అంతా అనుకునే సీన్ ఉంది. ఇంకో వైపు చూస్తే అమరావతికి చట్టబద్ధత కోరుతూ రాష్ట్ర శాసన సభ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ తీర్మానం ఆమోదించింది. మరి అదే సమయంలో శాసనమండలిలో ఈ తీర్మానం ప్రవేశపెట్టలేదు, దాంతో అది ఒక డ్రామా అని వైసీపీ విమర్శిస్తోంది.
మండలిలో చర్చ అనివార్యమా :
సరిగ్గా ఇక్కడే అనేక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకే సభ ఉంటే అక్కడ చర్చతో ముగించవచ్చు. కానీ రెండు సభలు ఉన్నపుడు ఏమి చేసినా రెండు సభలలో చర్చకు పెట్టాల్సి ఉంటుంది. ఇది సంప్రదాయం. కానీ అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి సభలో చర్చకే రావడం లేదు, మండలిలో వారికి బలం ఎక్కువ. అక్కడ చర్చ పెట్టమంటున్నారు. దాంతో వైసీపీది రాజకీయ వ్యూహం అని తెలిసిపోతోంది. దాంతో కూటమి సర్కార్ కూడా తెలివిగానే వ్యవహరించింది అని అంటున్నారు. మండలిలో అమరావతి మీద చర్చ జరగలేదు కాబట్టి తీర్మానం ఎంత వరకూ ఓకే అన్నది కూడా మరో వైపు చర్చిస్తున్నారు. అయితే మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడం అన్నది మంచిదే కానీ పెట్టకపోయినా ఏమీ జరగదు అని అంటున్నారు.
అభిప్రాయ సేకరణ కోసమే :
కేవలం అభిప్రాయ సేకరణ కోసమే రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయింది అన్నది గుర్తు పెట్టుకోవాలి. అమరావతి మీద బిల్లుని పెట్టి చట్టం చేయడం లేదు అన్నది కూడా మరవరాదు. ఆ పని కేంద్రం చేస్తుంది. రాష్ట్రం తరఫున అసెంబ్లీ తన అభిప్రాయాన్ని ఒక తీర్మాన రూపంలో తెలియచేస్తోంది. దాంతో అసెంబ్లీ సమావేశం అయి తీర్మానం రూపంలో అభిప్రాయం తెలియచేస్తే చాలు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. కేంద్రం కూడా రాష్ట్ర అసెంబ్లీ ఒపీనియన్ అడిగింది అని అంటున్నారు. అలా తీర్మానం రూపంలో ఏపీ తరఫున ఒక అభిప్రాయం కేంద్రానికి చేరుతుంది.
ఏపీకి శాశ్వత రాజధాని :
దానిని ఆసరాగా చేసుకుని కేంద్రం విభజన చట్టంలో సవరణ చేస్తూ బిల్లుని లోక్ సభలో రాజ్యసభలో ప్రవేశపెడుతుంది. అక్కడ ఉభయ సభలలో ఈ బిల్లు వస్తుంది. ఆ విధంగా అక్కడ ఆమోదం పొందినాక రాష్ట్రపతికి పంపించి ఆమోదముద్ర పడ్డాక ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ద్వరా రిలీజ్ అవుతుంది. విషయం ఇది కాబట్టే శాసన మండలి ఊసుని కూటమి సర్కార్ తలవలేదు. ఇక వైసీపీ ఈ విషయంలో ప్రశ్నించడం వల్ల విమర్శల పాలు అయ్యే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం ఉంది. అందువల్ల వైసీపీ తన చిత్తశుద్ధిని ఇక్కడ చాటుకోలేదన్న విషయం కూడా జనాల్లోకి పోతుంది అని అంటున్నారు.
