Begin typing your search above and press return to search.

జగన్ ఇమేజ్ ఓకే....లీడర్లు మాత్రం ?

ఏ రాజకీయ పార్టీకి అయినా సంస్థాగత బలం అతి ముఖ్యం. అది ఎలా వస్తుంది అంటే క్షేత్ర స్థాయిలో నిలబడి పనిచేసే నాయకులు.

By:  Satya P   |   5 Oct 2026 9:19 AM IST
జగన్ ఇమేజ్ ఓకే....లీడర్లు  మాత్రం ?
X

ఏ రాజకీయ పార్టీకి అయినా సంస్థాగత బలం అతి ముఖ్యం. అది ఎలా వస్తుంది అంటే క్షేత్ర స్థాయిలో నిలబడి పనిచేసే నాయకులు. అలాగే పార్టీకి అతి ముఖ్యం కార్యకర్తలు. అలా అంచెలంచెలుగా పార్టీ నిర్మాణం ఉండాలి. టాప్ టూ బాటమ్ వరకూ విధానాలు నిర్ణయాలు అన్నీ కూడా సరిగ్గా అమలు కావాలంటే నాయకుల పాత్ర ముఖ్యం. ఒక విధంగా క్యాడర్ కి అధినాయకుడికి మధ్యన నాయకులు కీలకంగా వారధిగా ఉంటారు. ఇదంతా గొలుసుకట్టు బంధంగా అందంగా ఉండాలి. ఇందులో ఏ గొలుసు తెగినా లేక గ్యాప్ పెరిగినా కూడా ఇబ్బంది అవుతుంది. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి అధినేతగా జగన్ కి అపారమైన జనాదరణ ఉంది. అదే సమయంలో ఆయన అభిమానులు వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు ఇలా వీరంతా వైసీపీకి కార్యకర్తలుగా బలంగా ఉన్నారు.

నాయకులు విషయంలోనే :

అయితే కార్యకర్తలు విశేషంగా ఉన్నారు. కానీ అధినాయకుడికీ వారికీ మధ్య అనుసంధానంగా నాయకులు కూడా అవసరం. వైసీపీలో చూస్తే కార్యకర్తల బలం చాలు అన్న విధానం అమలు అవుతోంది అంటున్నారు. నాయకులు ఎవరైనా సరే కాదు అనుకుంటే తేలికగా వదిలేస్తున్నారు. ఒక నాయకుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి అయిదేళ్ళ పాటు ప్రజలలో ఉంటూ పనిచేస్తారు. ఆ విధంగా ఆయన నియోజకవర్గం మొత్తం ప్రభావితం చేయగలుగుతాడు. అలాంటి నాయకుడు పార్టీని వీడినపుడు ఆయన వెంట ఎంతో కొంతమంది ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు వెళ్లిపోవడం సహజం. అలాగే ఆయన ప్లేస్ ని కూడా భర్తి చేసుకోవడం ఒకింత శ్రమగానే ఉంటుంది. పైకి మాత్రం నాయకులు పోయినా ఫరవాలేదు, మాకు కార్యకర్తలు ఉన్నారని అంటూంటారు. కానీ ఒక నియోజకవర్గం స్థాయి నాయకుడిని తయారు చేసి జనం మెప్పించేలా చేయడం అన్నది అతి పెద్ద కసరత్తుగానే చూడాలి.

వైసీపీ భిన్నమే :

ఈ విషయంలో మాత్రం వైసీపీ భిన్నమైన పంధాలోనే పోతోంది అని అంటారు. ఏ రాజకీయ పార్టీలో అయినా అలకలు అసంతృప్తులు అన్నవి సహజం. వాటి మీద ఎవరైనా కాస్తా దూరంగా ఉంటే బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి. వారికి నచ్చ చెప్పి తమ దారిలోకి తెచ్చుకునే విధంగా ఒక ఎక్సర్ సైజ్ అయితే తెర వెనక జరుగుతుంది. దాని కోసం ఒక పటిష్టమైన యంత్రాంగం కూడా ఉంటుంది. వైసీపీ విషయంలో చూస్తే వెళ్ళే వారు వెళ్లనీ అన్న వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది అని అంటారు. నిజమే ఇష్టం లేని వారిని పట్టి ఉంచలేరు. కానీ అన్ని వేళలలో బలీయంగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఎక్కడైనా అలక నుంచి అసంతృప్తిగా మారుతుంది. అక్కడ నుంచి అది కాస్తా ముదిరి అసమ్మతిగా బలపడుతుంది. ఆ మీదట వ్యతిరేకతతో స్థిరపడుతుంది. ఇలా వివిధ దశలుగా మారిన తరువాతనే ఎవరైనా పార్టీని వీడాలని అనుకుంటారు. అందువల్ల మొదటి దశలోనే అంటే అలకల సమయంలోనే దగ్గరకు పిలిచి సముదాయిస్తే అక్కడితో ఆ వ్యవహారం పెరిగి పెద్దది కాకుండా ఉంటుంది. దీని కోసమే పార్టీలలో ట్రబుల్ షూటర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు.

ఇద్దరికీ ఇబ్బందిగానే :

ఏ నాయకుడూ తాను ఉన్న పార్టీ నుంచి బయటకు పోవాలని అంత సులువుగా అనుకోరు. అవకాశవాదులను పక్కన పెడితే పార్టీలో ముందు నుంచి ఉన్న వారు చాలా కాలం ప్రయాణించిన వారు వేరే పార్టీలోకి వెళ్లాలని అక్కడ తమ రాజకీయ జాతకాన్ని పరిశీలించుకోవాలని రిస్క్ అయితే చేయరు. అనివార్యమైన పరిస్థితులు కనుక ఉంటేనే వారు అలా నెట్టబడతారు. మరి వైసీపీలో అలాంటి వాతావరణం ఉందా అన్నది సమీక్షించుకోవాలని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే వరసగా నియోజకవర్గం స్థాయి నేతలు అంతా పార్టీని వీడిపోతున్నారు. దానికి ప్రత్యర్థి పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ అతి పెద్ద ఆయుధంగా ఉంటే ఉన్న పార్టీలో ఏదో దశలో గ్యాప్ అన్నది ముదరడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు. నాయకులను తయారు చేసుకోగలమని అంతా చెబుతారు కానీ అదంత సులువు అయితే కాదు, అలాగని తల ఎగరేసే వారిని ఉంచుకోమని కానీ ఈ రెండింటికీ మధ్యన ఒక అనుసంధానం ఏదో ఉంటుంది. దానిని పట్టుకుంటే వలసల బెడద చాలా వరకూ తగ్గుతుంది అని అంటున్నారు.